Mamata meets Sonia: సోనియా గాంధీతో మమతా బెనర్జీ భేటీ

దిల్లీ పర్యటనలో ఉన్న పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయ్యారు.

Published : 28 Jul 2021 18:38 IST

వివిధ అంశాలపై అరగంటకుపైగా చర్చ

దిల్లీ: దిల్లీ పర్యటనలో ఉన్న పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయ్యారు. దాదాపు 45నిమిషాల పాటు వివిధ అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్‌డీఏ కూటమిని 2024 ఎన్నికల్లో ఓడించే లక్ష్యంతో ప్రతిపక్ష పార్టీలు ఏకమవుతోన్న వేళ ఇరు నేతల సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. బెంగాల్‌ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా తలపడిన అనంతరం రెండు పార్టీల అగ్రనేతలు సమావేశం కావడం ఇదే తొలిసారి.

‘సానుకూల వాతావరణంలో ఈ సమావేశం జరిగింది. భాజపాను ఓడించేందుకు ప్రతిఒక్కరూ ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఇలా అన్ని పక్షాలు కలిసి పోరాటం చేయాలి’ అని సోనియాగాంధీతో సమావేశమైన అనంతరం పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు. భాజపాకు వ్యతిరేకంగా ఏకమవుతున్న పక్షాలకు మీరు నేతృత్వం వహిస్తారా అన్న ప్రశ్నకు.. నేను రాజకీయ జోతిష్కురాలిని కాదని ఈ భేటీకి ముందు మీడియాతో మాట్లాడిన సందర్భంలో చెప్పారు. ఎవరు నేతృత్వం వహిస్తారనే అంశం అప్పటి పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని మమతా బెనర్జీ అభిప్రాయపడ్డారు.

ఇదిలాఉంటే, పెగాసస్‌తో పాటు రైతుల సమస్యలు, ఇతర అంశాలపై చర్చ జరపాలని పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీలు ఆందోళనలు చేపట్టిన వేళ మమతా బెనర్జీ దిల్లీ పర్యటన చేపట్టారు. ముఖ్యంగా పెగాసస్‌ స్పైవేర్‌ సహాయంతో తన ఫోన్‌ కూడా హ్యాకింగ్‌కు గురైనట్లు మమతా బెనర్జీ ఆరోపించారు. పెగాసస్‌ వ్యవహారంపై దర్యాప్తు జరపాల్సిందేనని డిమాండ్‌ చేశారు. ఇదే సమయంలో భాజపాకు వ్యతిరేకంగా పోరాడేందుకు పావులు కదుపుతున్న దీదీ, ఇప్పటికే కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు కమల్‌నాథ్‌, ఆనంద్‌ శర్మలతోనూ మంతనాలు జరిపారు. అంతకుముందు (మంగళవారం) ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోనూ మమతా బెనర్జీ సమావేశమయ్యారు. కరోనా టీకాలతో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని