
PM Race: ఇప్పుడే అన్నీ చెప్పేస్తే తర్వాత ఏముంటుంది..? మమతా బెనర్జీ
ప్రధానమంత్రి రేసుపై దీదీ దాటవేత ధోరణి
పనాజీ: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన మమతా బెనర్జీ.. ప్రధానమంత్రి రేసులో ఉన్నారనే వార్తలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా 2024 పార్లమెంటు ఎన్నికల్లో ప్రధాన మంత్రి పదవికి దీదీ పోటీ పడతారని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ విషయంపై తృణమూల్ పార్టీ కానీ, మమతా బెనర్జీ కానీ ఇప్పటివరకూ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. తాజాగా గోవా పర్యటనలో ఉన్న దీదీకి ఇదే ప్రశ్న మరోసారి ఎదురయ్యింది. ఈసారి కూడా దాటవేత ధోరణి ప్రదర్శించిన మమత.. ‘ఇప్పుడే అన్నీ చెప్పేస్తే తర్వాత ఏముంటుంది’ అంటూ సమాధానమిచ్చారు.
బెంగాల్లో హ్యాట్రిక్ విజయం సాధించిన మమతా బెనర్జీ.. జాతీయ రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించాలని భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే పలు రాష్ట్రాల్లో తృణమూల్ కాంగ్రెస్ను విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వివరిస్తున్నారు. ఇందులో భాగంగా మమతా బెనర్జీ తాజాగా గోవాలో మూడురోజుల పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా వచ్చే లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే గోవా అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పోటీకి దిగుతోందా? అని మమతను విలేకరులు ప్రశ్నించారు. ఇందుకు నేరుగా స్పందించని దీదీ.. 2024 ఎన్నికల్లో పోటీలో ఉంటామని మాత్రమే సమాధానమిచ్చారు. ‘మేం పారదర్శకంగా ఉంటాం. దాగుడుమూతలు ఆడం’ అని అన్నారు. ప్రధానమంత్రి పదవికి ఎందుకు పోటీ చేయకూడదని మరో విలేకరి ప్రశ్నించగా.. మీతోపాటు ఎవరైనా పోటీ చేయవచ్చని ఆమె సమాధానం దాటవేసే ప్రయత్నం చేశారు.
ఎన్నికల్లో గెలిచినా.. ఓడినా దేశ రాజకీయాల నుంచి భాజపా ఎక్కడికీ పోదని గోవాలో తృణమూల్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిశోర్ ఈ మధ్యే వ్యాఖ్యానించారు. మరికొన్ని దశాబ్దాల పాటు దేశ రాజకీయాల్లో భాజపా క్రియాశీలకంగానే ఉంటుందని చెప్పడం ఆసక్తిగా మారింది. ఇదే విషయంపై మమతా బెనర్జీని ప్రశ్నించగా.. ఆ విషయాన్ని ఆయననే అడగండంటూ సమాధానమిచ్చారు. అయితే, ప్రతిపక్షం సరిగా వ్యవహరించకుంటే భాజపా అలాగే ఉంటుందనే అర్థంలో ప్రశాంత్ కిశోర్ చెప్పి ఉండవచ్చని మమత సమర్థించుకునే ప్రయత్నం చేశారు.