
Manish Tewari Book: భాజపా స్పందన చూస్తుంటే ఆశ్చర్యమేస్తోంది..!
కాంగ్రెస్ సీనియర్ నేత మనీష్ తివారీ
దిల్లీ: ముంబయి పేలుళ్ల సమయంలో యూపీఏ ప్రభుత్వం దీటుగా స్పందించలేదంటూ కాంగ్రెస్ నేత మనీష్ తివారీ తాను రాసిన పుస్తకంలో పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే, దీనిపై భాజపా నుంచి వచ్చిన స్పందనను చూసి మనీష్ తివారీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జాతీయ భద్రతపై తాను రాసిన 304పేజీల పుస్తకంలో కేవలం ఒక్క అంశాన్ని పట్టుకొని భాజపా విమర్శలు చేస్తోందన్నారు. అదే సమయంలో జాతీయ భద్రతపై వారి (భాజపా) వ్యవహరించిన తీరుపై చేసిన కఠిన విశ్లేషణపైనా ఇదే విధంగా స్పందిస్తారా? అంటూ ట్విటర్లో ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
గడిచిన రెండు దశాబ్దాల్లో భారత జాతీయ భద్రతకు ఎదురైన సవాళ్లపై ‘10 ఫ్లాష్ పాయింట్స్: 20 ఇయర్స్ - నేషనల్ సెక్యూరిటీ సిచ్యువేషన్స్ దట్ ఇంపాక్టెడ్ ఇండియా’ అనే పేరుతో కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ ఓ పుస్తకాన్ని రాశారు. 304 పేజీలున్న ఈ పుస్తకం డిసెంబర్ 1న విడుదల కానుంది. అందులో కొన్ని అంశాలను ప్రస్తావిస్తూ తాజాగా మనీష్ తివారీ ట్విటర్లో షేర్ చేశారు. వందలాది మంది అమాయకులను అత్యంత క్రూరంగా హతమార్చిన సందర్భంలో సహనంతో ఉండడమనేది బలానికి సంకేతం కాదని.. అది కచ్చితంగా బలహీనతకు సంకేతమేనంటూ అప్పటి యూపీఏ ప్రభుత్వ ప్రతిస్పందనను పరోక్షంగా విమర్శించారు.
ఈ విషయాన్నే అస్త్రంగా మలచుకొన్న భాజపా నాయకులు.. జాతీయ భద్రత విషయంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం సరిగా వ్యవహరించలేదంటూ విమర్శలు మొదలుపెట్టారు. ఇదే అంశంపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో సహా పలువురు భాజపా నేతలు కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ నేత రాసిన పుస్తకంలోని అంశాలను చూస్తుంటే అప్పటి యూపీఏ ప్రభుత్వానిది ఎంత అసమర్థ, బలహీన పాలనో స్పష్టమవుతోందంటూ తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇలా భాజపా నాయకుల విమర్శలపై స్పందించిన మనీష్ తివారీ.. జాతీయ భద్రత విషయంలో వారి (భాజపా) ప్రభుత్వంపై చేసిన కఠిన విశ్లేషణపైనా ఇలాగే స్పందిస్తారా? అంటూ ట్విటర్లో పేర్కొన్నారు.