Metro Sreedharan: మెట్రోమ్యాన్‌ శ్రీధరన్‌.. రాజకీయాలకు బైబై..!

మెట్రోమ్యాన్‌గా పేరుగాంచిన ప్రముఖ ఇంజినీర్‌ ఇ. శ్రీధరన్‌.. క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండనున్నట్లు ప్రకటించారు.

Published : 17 Dec 2021 01:35 IST

పాలక్కాడ్‌: మెట్రోమ్యాన్‌గా పేరుగాంచిన ప్రముఖ ఇంజినీర్‌ ఇ. శ్రీధరన్‌.. క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండనున్నట్లు ప్రకటించారు. ఇటీవల కేరళ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన ఆయన.. వాటినుంచి ఎన్నోపాఠాలు నేర్చుకున్నానని అన్నారు. అయితే, ఎన్నికల ముందే రాజకీయాల్లోకి వచ్చిన శ్రీధరన్‌ ఏడాది కాకముందే తిరిగి వాటికి గుడ్‌బై చెప్పడం గమనార్హం.

‘నేనెప్పుడూ రాజకీయ నాయకుడిని కాదు. నా వయసు ఇప్పుడు 90ఏళ్లు. ఇలాంటి సమయంలో క్రియాశీల రాజకీయాల్లో కొనసాగడం ప్రమాదకరం. నా సొంత ప్రాంతానికి సేవ చేయాలనుకుంటే నాకు రాజకీయాలే అవసరం లేదు. ఇప్పటికే ఓ మూడు ట్రస్టుల ద్వారా ఆ ప్రయత్నం చేస్తున్నా. అయినప్పటికీ క్రియాశీల రాజకీయాల్లో లేనంటే రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకున్నట్లు కాదు’ అని మెట్రోమ్యాన్‌ శ్రీధరన్‌ వెల్లడించారు.

ఇక అసెంబ్లీ ఎన్నికలకు ముందే రాజకీయాల్లో అడుగుపెట్టిన శ్రీధరన్‌.. భారతీయ జనతా పార్టీలో చేరారు. పార్టీ నిర్ణయం మేరకు ఎన్నికల్లో పోటీ చేస్తానని.. ఒకవేళ పార్టీ కోరితే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమేనని అన్నారు. రాష్ట్రంలో పెద్దఎత్తున మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని అప్పట్లో పేర్కొన్నారు. అనంతరం పాలక్కాడ్‌ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన ఆయన 50వేల ఓట్లు సాధించి ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చారు. అయినప్పటికీ కాంగ్రెస్‌ ప్రత్యర్థి చేతిలో 3859 ఓట్ల తేడాతో శ్రీధరన్‌ ఓటమి పాలయ్యారు. కేరళలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడితో సహా ఏ ఒక్క స్థానంలోనూ భాజపా గెలువలేకపోయింది.

ఇదిలాఉంటే, దేశ రాజధాని దిల్లీలో మెట్రో రైళ్లకు రూపకల్పన చేసి విజయం సాధించిన ఇ.శ్రీధరన్‌.. మెట్రోమ్యాన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. 2011లో దిల్లీ మెట్రో నుంచి పదవీ విరమణ పొందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని