AP News: ఇళ్ల పథకంపై హైకోర్టు తీర్పు బాధ కలిగించింది: బొత్స

ఏపీలో పేదలందరికీ ఇళ్ల పథకంపై హైకోర్టు తీర్పు చాలా బాధ కలిగించిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

Updated : 09 Oct 2021 15:47 IST

అమరావతి: ఏపీలో పేదలందరికీ ఇళ్ల పథకంపై హైకోర్టు తీర్పు చాలా బాధ కలిగించిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. దీనిపై ఉన్నత న్యాయస్థానానికి ఆశ్రయిస్తామని చెప్పారు. విజయనగరంలోని ఆనంద గజపతి ఆడిటోరియంలో నిర్వహించిన వైఎస్‌ఆర్‌ ఆసరా చెక్కుల పంపిణీలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడిన ఆయన ప్రభుత్వ వివరణ తీసుకోకుండానే తీర్పు ఇవ్వడం బాధాకరమన్నారు. ‘‘ప్రతి మహిళ ఇంటి యజమానిగా ఉండాలనే ఇళ్ల  పథకం తీసుకొచ్చాం. కోర్టు తీర్పులకు ప్రభుత్వం వ్యతిరేకం కాదు. కేంద్ర విధివిధానాలతోనే ఇళ్ల పథకం చేపట్టాం.
రాజ్యాంగ విరుద్ధంగా ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నాం. ఇళ్ల పథకాన్ని అడ్డుకుంటే ప్రజలకు దిక్కెవరు?రాజ్యాంగబద్ధంగానే సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం’’ అని బొత్స అన్నారు. ఇళ్ల నిర్మాణానికి పట్టణాల్లో సెంటు, గ్రామాల్లో సెంటున్నర స్థలాలు సరిపోవని, ఈ విషయంలో ప్రత్యేక కమిటీతో అధ్యయనం చేయించాలని హైకోర్టు నిన్న సూచించిన విషయం తెలిసిందే. ఆ ప్రక్రియ ముగిసే వరకు ఆ స్థలాల్లో నిర్మాణాలు చేపట్టవద్దని తీర్పు చెప్పింది.

గతంలో ఎవరూ పేదలకు సెంటు భూమి కూడా ఇవ్వలేదు: సుచరిత

మరోవైపు, పేదల ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్తుందని ఏపీ హోంమంత్రి సుచరిత స్పష్టంచేశారు. గతంలో ఎవరూ పేదలకు ఒక్క సెంటు భూమి కూడా ఇవ్వలేదన్నారు. ఒకే గదిలో ఉంటూ అద్దె ఇళ్లలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు.  ప్రభుత్వం ఇచ్చిన స్థలాలపై వంకలు పెట్టడం సరికాదని ఆమె వ్యాఖ్యానించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని