
TS News: కేంద్రం కొంత బియ్యాన్నే కొంటే.. మిగిలింది ఏం చేయాలి?: గంగుల
కరీంనగర్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఒప్పందం మేరకే రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేశామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కాగా, కేంద్ర ప్రభుత్వం కొంత బియ్యాన్నే కొంటామని చెబితే మిగిలింది ఏం చేయాలి అని ఆయన ప్రశ్నించారు. కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను సెప్టెంబర్ 1న కలిసి పంట కొనుగోళ్లను కొనసాగించాలని కోరాం. లాభనష్టాలు చూడకుండా సామాజిక బాధ్యత కింద కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశాం. రైతుల కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలు తెచ్చారు. ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తెలంగాణను మార్చాం. కాళేశ్వరం జలాలు, 24 గంటలూ విద్యుత్, రైతుబంధు సాయంతో రైతులను ఆదుకున్నాం. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రం మధ్య అవగాహన ఒప్పందం ఉంది.
2019 యాసంగిలో 64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం. 2020-21 యాసంగిలో 92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. రైతులంతా నారుమళ్లు పోసిన తర్వాత ధాన్యం కొనుగోలు చేయబోమని కేంద్రం చెప్పింది. 92 లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యానికి 62 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం వస్తోంది. 25 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే తీసుకుంటామని చెప్పారు. మిగిలిన బియ్యాన్ని ఏం చేయాలి’’ అని గంగుల ప్రశ్నించారు.