Ap News: ఏపీలో మూడు రాజధానులు కచ్చితంగా ఏర్పడి తీరుతాయ్‌: కన్నబాబు

రాష్ట్రంలో మూడు రాజధానులు కచ్చితంగా ఏర్పడి తీరుతాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు. మూడు రాజధానులకు ప్రజామోదం ఉందని

Published : 17 Nov 2021 01:21 IST

అమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానులు కచ్చితంగా ఏర్పడి తీరుతాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు. మూడు రాజధానులకు ప్రజామోదం ఉందని, స్థానిక ఎన్నికల్లో మాకు 85 శాతం ప్రజల మద్దతు రావడమే దీనికి నిదర్శనమన్నారు. మూడు ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం కాబట్టే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మూడు రాజధానులు కట్టడం వైకాపా వల్ల కాదని నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను కన్నబాబు కొట్టిపారేశారు. మూడు రాజధానులు కడతామో లేదో... వైకాపా వల్ల అవుతుందో, లేదో అనేది త్వరలోనే చూస్తారన్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు అభివృద్ధి చెందకూడదనే తెదేపా భావిస్తోందని విమర్శించారు. ఒక ప్రాంతానికే పరమితం కావాలని అనుకుంటే భాజపా నేతలు అమరావతికి మద్దతుగా వెళ్లొచ్చన్నారు. రెండున్నరేళ్లలో అధికారంలోకి వస్తామని తెదేపా అధినేత చంద్రబాబు కలలు కంటున్నారని.. అది ఎప్పటికీ సాధ్యం కాదని ఎద్దేవా చేశారు.

కేంద్ర ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకుంటే రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అంటున్నారని.. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఏం సాయం చేయలేదో సోము వీర్రాజు చెప్పాలని కన్నబాబు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్లే రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారని విమర్శించారు. రైతులను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయొద్దని అన్ని పార్టీలకూ సూచించారు. కుప్పంలో ఓడిపోతున్నామనే దొంగఓట్లు వేశారంటూ చంద్రబాబు కట్టుకథను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కుప్పం మున్సిపాల్టీని వైకాపా కైవసం చేసుకోవడం ఖాయమన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని