Updated : 12 Nov 2021 17:47 IST

KTR: కేంద్రం అన్నీ అమ్ముతోంది.. వడ్లు మాత్రం కొనట్లేదు: కేటీఆర్‌

సిరిసిల్ల: బియ్యం ఎగుమతి చేసే అధికారం రాష్ట్రాలకు లేదని.. కేంద్రమే ధాన్యం కొని ఎగుమతి చేయాల్సి ఉందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ అన్నారు. అన్నీ అమ్మాలి.. వడ్లు కొనొద్దనేది భాజపా విధానమని ఎద్దేవా చేశారు. యాసంగిలో వరి వద్దే వద్దని కేంద్ర ప్రభుత్వం మొండికేసిందని ఆయన ఆక్షేపించారు. కేంద్రం యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు చేయాల్సిందేనన్న డిమాండ్‌తో సిరిసిల్లలో నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, భాజపా నేతల వైఖరిపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

కేంద్రంలోని నేతలకు సిగ్గు అనిపించడం లేదా?

‘‘కేంద్రం అన్నీ అమ్ముతోంది.. వడ్లు మాత్రం కొనట్లేదు. దేశంలో సాగుకు 40కోట్ల ఎకరాలు, 65వేల టీఎంసీల నీరు అందుబాటులో ఉంది.  దేశవ్యాప్తంగా వసతులు ఉన్నా వినియోగించుకోలేని దుస్థితి నెలకొంది. ప్రపంచ ఆకలి సూచీలో భారత్‌కు 102వ స్థానం ఉండటం సిగ్గుచేటు. నేపాల్‌, బంగ్లాదేశ్‌, భూటాన్‌ కంటే భారత్‌ పరిస్థితి దిగజారింది. దివాలా విధానాలు, చేతకాని పాలనతో తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చారు. కేంద్రంలోని నేతలకు సిగ్గు అనిపించడం లేదా? తెలంగాణ స్థాయిలో దేశాన్ని అభివృద్ధి చేయడం వాళ్లకు చేతకావడం లేదు. పేదలకు తిండి పెడుతూనే విదేశాలకూ ఎగుమతి చేయాలి. మనం జైకిసాన్‌ అంటే వాళ్లు నై కిసాన్‌ అంటున్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో రైతుల జోష్‌ చూస్తుంటే తెలంగాణ ఉద్యమం నాటి రోజులు గుర్తొచ్చాయి. రోడ్డెక్కే పరిస్థితి ఎందుకు వచ్చిందో రైతులు తెలుసుకోవాలి. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో రైతులంతా మరోసారి ఉద్యమించాలి.

మన పథకాలను 11 రాష్ట్రాలు కాపీ కొట్టాయి

కేసీఆర్‌ పాలనలో సాగులో అద్భుత రికార్డులు నమోదుచేశాం. ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్‌ను దాటేశాం. ఒకప్పుడు రైతు ఆత్మహత్యలకు తెలంగాణ కేరాఫ్‌గా ఉండేది. ఇప్పుడు రాష్ట్ర రైతులు 3కోట్ల టన్నుల ధాన్యం పండిస్తున్నారు. రైతుబంధు కింద సంవత్సరానికి ఎకరాకు రూ.10వేలు ఇస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వ పథకాలను 11 రాష్ట్రాలు కాపీ కొట్టాయి. కేంద్రం కూడా రాష్ట్రం నుంచి ఎంతో కొంత నేర్చుకొని ఇదే తరహాలో రైతులకు సాయం అందిస్తోంది. రైతుబంధు మాత్రమే సరిపోదని.. రైతు ఆకస్మికంగా చనిపోతే కుటుంబం ఆగం కావొద్దని రూ.5లక్షల రైతు బీమా అమలు చేస్తున్నాం. ఇలాంటి పథకాలు దేశంలో ఎక్కడా లేవు. ప్రపంచంలోనే ఏ ప్రభుత్వమూ అమలు చేయని ఆలోచనలు.. పథకాలు అందిస్తున్నాం. పుష్కలంగా నీరు ఉండే డెల్టా ప్రాంతం తరహా దృశ్యాలు ఇప్పుడు సిరిసిల్ల ప్రాంతంలో చూస్తున్నాం. కేసీఆర్‌తోనే ఈ అభివృద్ధి సాధ్యమైంది. కాలంతో పోటీ పడి ప్రపంచంలోని అతిపెద్ద మల్టీ స్టేజ్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీం కాళేశ్వరం నిర్మించారు. గోదావరి జలాలను బీడు భూములకు చేర్చారు. కొత్తగా లక్షల ఎకరాలకు నీళ్లిచ్చారు. ఏడేళ్లలో ఎన్ని అద్భుత రికార్డులు సాధించామో రైతులు గుర్తు చేసుకోవాలి’’ అని కేటీఆర్‌ అన్నారు.


Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని