KTR: అది నిజం కాకపోతే రాజీనామా చేస్తా.. మరి బండి సంజయ్‌ చేస్తారా?: కేటీఆర్‌

‘‘ఆరున్నరేళ్లలో రాష్ట్రం నుంచి కేంద్రానికి రూ.2.72 లక్షల కోట్లు వెళ్లాయి. రాష్ట్రానికి కేంద్రం రూ.1.42 లక్షల కోట్లు మాత్రమే ఇచ్చింది. ఇది నిజం కాకపోతే నేను రాజీనామా చేస్తాను

Updated : 14 Sep 2021 17:47 IST

గద్వాల: ‘‘ఆరున్నరేళ్లలో రాష్ట్రం నుంచి కేంద్రానికి రూ.2.72 లక్షల కోట్లు వెళ్లాయి. రాష్ట్రానికి కేంద్రం రూ.1.42 లక్షల కోట్లు మాత్రమే ఇచ్చింది. ఇది నిజం కాకపోతే నేను రాజీనామా చేస్తాను. బండి సంజయ్ ఎంపీ పదవికి రాజీనామా చేస్తారా?’’ అని మంత్రి కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలకు మొత్తం నిధులు కేంద్రమే ఇస్తే కర్ణాటకలో ఎందుకు లేవని ప్రశ్నించారు. తెలంగాణ పన్నులను ఇతర రాష్ట్రాల్లో ఖర్చు చేస్తున్నారని.. రాష్ట్రాన్ని ప్రధాని మోదీ దగా చేస్తున్నారని కేటీఆర్‌ ధ్వజమెత్తారు. దొడ్డు ధాన్యం కొనేది లేదని కేంద్రం చెప్తోందన్నారు. కేంద్రంపై పోరాటం చేస్తూనే ప్రత్యామ్నాయ పంటల దృష్టి సారించాలని కేటీఆర్‌ సూచించారు. గద్వాల పర్యటనలో ఉన్న కేటీఆర్‌ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. చిన్నపాడు స్టేజీ వద్ద విత్తన పత్తి రైతులతో మాట్లాడారు. రేవులపల్లి వద్ద జూరాల పార్కుకు మంత్రి శంకుస్థాపన చేశారు. రూ.15 కోట్ల వ్యయంతో జూరాల ప్రాజెక్టుకు ఇరువైపులా పార్కు నిర్మాణం చేపట్టనున్నారు. గద్వాలలో చెన్నకేశవ సంగాల పార్కును కేటీర్‌ ప్రారంభించారు. అనంతరం గద్వాలలో ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్‌ మాట్లాడారు.

‘‘వాల్మీకి సోదరుల సమస్యను ఏ రాజకీయ పార్టీ పట్టించుకోలేదు. 2007లోనే దీనిపై అందరికంటే ముందు స్పందించిది కేసీఆర్‌. తెరాస అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చెల్లప్ప కమిషన్‌ ఏర్పాటు చేశారు. ఇది న్యాయమైన డిమాండ్‌ అని.. వాల్మీకి సోదరులను ఎస్టీల్లో కలపాలని చెల్లప్ప కమిషన్‌ కూడా సిఫారసు చేసింది. దీనిపై శాసనసభలో చట్టం చేసి కేంద్రానికి పంపించాం. వాల్మీకి, బోయ సోదరులపై ప్రేమ ఉంటే..ఈ  ప్రాంతం నుంచి భాజపాలో ఉన్న జాతీయ నాయకురాలు డీకే అరుణ మోడీగారిని ఒప్పించి రిజర్వేషన్లు కల్పించే విధంగా కృషి చేయాలి. అసెంబ్లీలో చట్టం చేసి అక్కడే వదిలేయం.. పోరాడుతాం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పార్లమెంట్‌లో ఎంపీ రాములు గళమెత్తుతారు. 70 ఏళ్లలో జరగని అభివృద్ధిని ఏడేళ్లలో చేసి చూపించాం. ఇళ్ల పంపిణీలో వేగం పెంచాలని ప్రజలు కోరుతున్నారు. అర్హులైన పేదలకు ఇళ్లు మంజూరు చేస్తాం. తండాలు గ్రామపంచాయతీలు కావాలని గిరిజనులు దశాబ్దాల పాటు ఎదురు చూశారు. వారి కలను కేసీఆర్‌ నెరవేర్చారు. పొరుగు రాష్ట్రాల్లో పాలన ఎలా ఉందో భాజపా కార్యకర్తలు పరిశీలించాలి’ అని మంత్రి కేటీఆర్‌ అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని