TS News: మాకు తక్షణమే సమయం కేటాయించండి: తెలంగాణ మంత్రి నిరంజన్‌రెడ్డి

తెలంగాణ రైతుల ప్రయోజనాల కోసమే దిల్లీ వచ్చామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి చెప్పారు. తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల సమస్యపై చర్చించేందుకు

Updated : 20 Dec 2021 13:20 IST

దిల్లీ: తెలంగాణ రైతుల ప్రయోజనాల కోసమే దిల్లీ వచ్చామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి చెప్పారు. తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల సమస్యపై చర్చించేందుకు తక్షణమే తమకు సమయం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని.. వీలైనంత త్వరగా సమయం ఇచ్చి తమ గోడు వినాలన్నారు. తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల సమస్యపై కేంద్ర ప్రభుత్వంతో మరోసారి చర్చించేందుకు రాష్ట్ర మంత్రుల బృందం శనివారం దిల్లీ చేరుకుంది. మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, జగదీశ్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, పలువురు ఎంపీలు ఈ బృందంలో ఉన్నారు.

రెండు రోజులు గడిచినా కేంద్ర ప్రభుత్వం తమకు సమయం ఇవ్వలేదని మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు. నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ దిల్లీలో తమను నిరీక్షించేలా చేయడమంటే తెలంగాణ రైతులను అవమానించడమేనని చెప్పారు. ధాన్యం కొనుగోళ్లు అనేది తెలంగాణకు చెందిన గంభీరమైన అంశమని.. ఈ అంశంలో తమకు ఇష్టమైనపుడే కలుస్తామనే భావన కేంద్ర ప్రభుత్వంలో ఉండటం సరికాదన్నారు. రాబోయే ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేస్తుందో లేదో స్పష్టం చేయాలన్నారు. దీనిపై నోటి మాట కాకుండా రాత పూర్వక హామీ ఇవ్వాలని నిరంజన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

ధాన్యం కొనుగోళ్ల సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి, తీవ్రతను తెలియజెప్పాలని శుక్రవారం తెలంగాణభవన్‌లో పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీనికి అనుగుణంగా మంత్రులు దిల్లీకి పయనమయ్యారు. ఇప్పటికే ప్రధాని మోదీ, ఆహార, పౌరసరఫరాలు, వ్యవసాయ మంత్రులు పీయూష్‌ గోయల్‌, నరేంద్రసింగ్‌ తోమర్‌లను కలిసేందుకు అపాయింట్‌మెంట్‌ కోరారు. అయితే అపాయింట్‌మెంట్ ఇంకా ఖరారు కాకపోవడంతో మంత్రులు మీడియా సమావేశం నిర్వహించి కేంద్రం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని