Ts News: దశలవారీగా రాష్ట్రమంతా దళితబంధు అమలు: సీఎం కేసీఆర్‌

రైతుబంధు పథకం యథావిధిగా కొనసాగుతుందని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. దళితబంధుపై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని.. వాటి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ఈ పథకాన్ని దశలవారీగా రాష్ట్రమంతా...

Published : 18 Dec 2021 01:02 IST

హైదరాబాద్‌: రైతుబంధు పథకం యథావిధిగా కొనసాగుతుందని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. దళితబంధుపై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని.. వాటి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ఈ పథకాన్ని దశలవారీగా రాష్ట్రమంతా అమలు చేస్తామని వెల్లడించారు. కష్టపడి పనిచేయాలని.. నిరంతరం ప్రజల్లో ఉండాలని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన తెరాస విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ధాన్యం కొనుగోళ్లు, గనుల ప్రైవేటీకరణ, ఇతర అంశాలపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. కేంద్రంపై పోరులో భవిష్యత్తు కార్యాచరణపై నేతలకు సీఎం దిశానిర్దేశం చేశారు.

సమావేశం ముగిసిన అనంతరం మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ భేటీలో చర్చించిన అంశాలను వివరించారు. ‘‘కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల తెలంగాణలో రైతులు బాధపడుతున్నారు. పార్లమెంట్‌లోనూ తెరాస సభ్యులు రైతుల సమస్యలపై పోరాటం చేస్తున్నారు. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలను తెరాస ఎంపీలు ఉభయసభల్లో ప్రశ్నిస్తున్నారు. కేంద్రం ఈసారి వానాకాలం ధాన్యం కొనుగోలు కోటాను భారీగా తగ్గించింది. ధాన్యం సేకరణపై కేంద్రం ఇచ్చిన లక్ష్యం ఇప్పటికే పూర్తి చేశాం. రాష్ట్రంలో సేకరించాల్సిన ధాన్యం ఇంకా చాలా ఉంది. ఇంకా సగం పంట కల్లాలు, పొలాల్లోనే ఉంది. మిగిలిపోయిన ధాన్యాన్ని ఏం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. దిల్లీకి వెళ్లి కేంద్రాన్ని మరోసారి నిలదీయాలని భావిస్తున్నాం.  రా రైస్‌ ఎంతైనా కొంటామని హామీ ఇచ్చిన కేంద్రం ఇప్పుడు ఎందుకు కొనట్లేదు?కేంద్ర ప్రభుత్వానిది బాధ్యతారాహిత్యం. గోదాములు, వ్యాగన్లు ఖాళీ లేవంటూ ఎఫ్‌సీఐ బియ్యం తరలించట్లేదు. రాష్ట్రంలో 65 లక్షల హెక్టార్లలో పంట దిగుబడి వచ్చింది. తెరాస ఎంపీలతో కలిసి ఆరుగురు మంత్రుల బృందం రేపు దిల్లీకి వెళ్లాలని నిర్ణయించాం’’ అని మంత్రి వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని