
Ap News: పెట్రో ధరలు పెంచిన వాళ్లే రోడ్లపై ధర్నాలు చేస్తారా?: పేర్ని నాని
అమరావతి: పెట్రోల్ ధరను రూ.116 వరకూ ఎవరు తీసుకెళ్లారని.. పెట్రో ధరలు పెంచిన వాళ్లే రోడ్లపై ధర్నాలు చేస్తారా? అని మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.70 ఉండాల్సిన పెట్రోల్ ధరను ఎక్కడికి తీసుకెళ్లారు? ప్రజలకు ఏమీ గుర్తుండదని భాజపా నేతలు భావిస్తున్నారా? అని ప్రశ్నించారు. తాడేపల్లిలో మంత్రి మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు పెట్రోల్, డీజిల్‌పై రూ.5 తగ్గించామని చెబుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. రోడ్ల మరమ్మతుల కోసమే పెట్రోల్, డీజిల్‌పై రూ.1 సెస్ వేశామని స్పష్టం చేశారు. రూ.2.87 లక్షల కోట్లను పన్నుల కేంద్రం వసూలు చేస్తోందన్నారు. రూ.47వేల కోట్ల ఎక్సైజ్ పన్నునూ కేంద్రం వసూలు చేస్తోందని మంత్రి పేర్కొన్నారు.
‘‘ఇక్కడి భాజపా నేతలు దిల్లీ నార్త్‌బ్లాక్ వద్దకు వెళ్లి ధర్నా చేయాలి. పెంచిన పెట్రో ధరలు వెంటనే తగ్గించాలి. కొన్ని నెలలుగా వీరబాదుడు బాది ఇప్పుడు రూ.5 తగ్గిస్తారా? లీటర్‌కు రూ.10 కాదు.. రూ.30 తగ్గించాలి. పెట్రో ధరలపై నార్త్ బ్లాక్ వద్ద ధర్నా చేస్తే నేనూ వస్తాను. చాలా రాష్ట్రాలు పన్ను ఎందుకు తగ్గించలేదో అడగాలి. కేంద్రం దొంగచాటు పన్నులు 14 రాష్ట్రాలు గమనిస్తున్నాయి. రూ.70 ఉండాల్సిన పెట్రోల్ ధరను సెస్‌ల పేరుతో విపరీతంగా పెంచారు. తెదేపా పాలనలో పెట్రోల్‌పై 31 శాతం పన్ను, ప్రత్యేక సర్‌ఛార్జి విధించారు. ఈ విషయాన్ని చంద్రబాబు గుర్తుంచుకోవాలి. తెదేపా కార్యాలయంలో ఇచ్చిన స్క్రిప్ట్‌నే భాజపా నేతలు చదువుతున్నారు’’ అని నాని తెలిపారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.