TS News: కేంద్రం తీసుకోకపోతే.. ధాన్యం తెచ్చి ఇండియాగేటు వద్ద పారబోస్తాం: ప్రశాంత్‌రెడ్డి

తెలంగాణలో దాదాపు ఇంకా 60లక్షల టన్నుల ధాన్యం నిల్వ ఉందని, మొత్తం ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలుచేయకపోతే దిల్లీ తీసుకొచ్చి ఇండియాగేటు

Published : 25 Dec 2021 01:35 IST

దిల్లీ: తెలంగాణలో దాదాపు ఇంకా 60లక్షల టన్నుల ధాన్యం నిల్వ ఉందని, మొత్తం ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలుచేయకపోతే దిల్లీ తీసుకొచ్చి ఇండియాగేటు వద్ద పారబోస్తామని మంత్రి ప్రశాంత్‌రెడ్డి  కేంద్ర ప్రభుత్వానికి తెలిపారు. దిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ధాన్యం సేకరణపై మాట్లాడేందుకు వారం రోజుల క్రితం మంత్రులు, ఎంపీల బృందం దిల్లీకి వచ్చినా కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేదన్నారు. 

‘‘తెలంగాణలో పండిన ధాన్యంలో 60లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేస్తామని ఇండెంట్‌ ఇచ్చారు. ఇవాళ్టితో ఆ టార్గెట్‌ పూర్తయింది. రాబోయే 60లక్షల మెట్రిక్‌ టన్నులకుపైగా ధాన్యాన్ని కూడా సేకరిస్తామని లిఖితపూర్వక హామీ ఇవ్వాలని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌కు విజ్ఞప్తి చేశాం. రెండ్రోజుల సమయం ఇవ్వాలని అడిగారు. రెండ్రోజులు గడిచినా ఎలాంటి స్పందన లేదు. రెసిడెంట్‌ కమిషనర్‌ ద్వారా పీయూష్‌ గోయల్‌  అపాయింట్‌మెంట్‌ అడిగినా ఇంకా ఇవ్వలేదు. ఇది చాలా దురదృష్టకరం. కేంద్ర ప్రభుత్వం అనుసరించాల్సిన పద్ధతి ఇది కాదు. తెలంగాణ రైతుల తరఫున కేంద్రం వైఖరిని తీవ్రంగా పరిగణిస్తున్నాం. ధాన్యం కొనుగోలు కేంద్రాలు నడుస్తున్నాయి. బియ్యం సేకరణపై ఎఫ్‌సీఐ, కేంద్రం గోడౌన్లు పెంచలేదు. వానాకాలంలో రైతులు పండించిన 60లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి, డబ్బులు చెల్లిస్తుంది. తెలంగాణలో వానాకాలంలో ఎంత పండితే అంత ధాన్యం తీసుకుంటామని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ పార్లమెంట్‌లో మాట ఇచ్చారు. మీడియాతో మాట్లాడుతూ... కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు. అయినా, దానిపై ఇంకా స్పష్టత ఇవ్వట్లేదు. పార్లమెంట్‌లో ఇచ్చిన మాట ప్రకారం.. లిఖితపూర్వక హమీ ఇస్తూ లేఖ ఇవ్వకపోతే  రైతుల వద్ద కొనుగోలు చేసిన 60లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని  దిల్లీ తీసుకొచ్చి ఇండియాగేటు వద్ద పారబోస్తాం. తెలంగాణ రైతులను తీవ్రంగా అవమానించే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది’’ అని ప్రశాంత్‌రెడ్డి అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని