TS News: చిన్నారెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి కౌంటర్‌

ఎమ్మెల్యే జగ్గారెడ్డి క్రమశిక్షణ ఉల్లంఘించారని కమిటీ భావిస్తున్నట్టు పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌ చిన్నారెడ్డి మీడియాకు వెల్లడించిన అంశాలపై పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌,

Published : 01 Jan 2022 01:25 IST

హైదరాబాద్‌: ఎమ్మెల్యే జగ్గారెడ్డి క్రమశిక్షణ ఉల్లంఘించారని కమిటీ భావిస్తున్నట్టు పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌ చిన్నారెడ్డి మీడియాకు వెల్లడించిన అంశాలు పార్టీలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. దీనిపై పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్రంగా స్పందించారు. రాజకీయ వ్యవహారాల కమిటీలో చర్చించకుండా పార్టీ కార్యక్రమాలపై ప్రకటనలు చేస్తున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని కూడా కమిటీ ముందుకు పిలవాలని, అప్పుడే తాను కమిటీ ముందు హాజరవుతానని స్పష్టం చేశారు. ఇవాళ గాంధీభవన్‌లో క్రమశిక్షణ కమిటీ సమావేశం అనంతరం చిన్నారెడ్డి మీడియాకు పలు విషయాలు వెల్లడించడంపై స్పందించిన జగ్గారెడ్డి.. పలు అంశాలు లేవనెత్తారు. 

సోనియాగాంధీకి తాను రాసిన లేఖ మీడియాకు ఎలా లీక్‌ అయ్యిందో తెలియదన్న విషయం మీడియా ద్వారా కూడా వివరణ ఇచ్చినట్టు జగ్గారెడ్డి వివరించారు. తన లేఖపై క్రమశిక్షణ కమిటీకి ఎవరైనా ఫిర్యాదు ఇచ్చారా? లేక మీడియాలో వచ్చిన వార్తలను కమిటీ సుమోటోగా తీసుకున్నదా? అన్న విషయాన్ని చిన్నారెడ్డి మీడియా ముందు ఎందుకు వెల్లడించలేదని ప్రశ్నించారు. పార్టీలో చర్చించకుండా పెద్దపల్లి అభ్యర్థిని ప్రకటించి పార్టీ లైన్‌ దాటిన పీసీసీ అధ్యక్షుడు క్రమశిక్షణ పరిధిలోకి రాడా? అని నిలదీశారు. తన సొంత ఉమ్మడి జిల్లాలో ఒక ఎమ్మెల్యేగా, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా తనకు చెప్పకుండా కార్యక్రమం ప్రకటన చేస్తే అది క్రమశిక్షణ కిందకు రాదా? అని ప్రశ్నించారు. ‘‘వరంగల్‌ పార్లమెంట్‌ ఇన్‌ఛార్జిగా నేను భూపాలపల్లిలో రచ్చబండ కార్యక్రమానికి వెళ్తున్నట్టు ఇవాళ పత్రికల్లో చూశాను.. నాకు సమాచారం ఇవ్వకపోవడం క్రమశిక్షణ కిందకు రాదా?. క్రమశిక్షణ పాటించని పీసీసీపై క్రమశిక్షణ తీసుకోవాలన్న విషయం చిన్నారెడ్డికి తెలీదా?. క్రమశిక్షణ కమిటీ ముందుకు రేవంత్‌రెడ్డిని పిలిచిన తరువాతనే నన్ను పిలిస్తే తప్పకుండా హాజరవుతా. చిన్నారెడ్డి మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు కాబట్టే నేను కూడా చిన్నారెడ్డికి మీడియా ద్వారానే జవాబిస్తున్నా’’ అని జగ్గారెడ్డి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని