Updated : 26 Nov 2021 16:04 IST

TS News: కేసీఆర్‌ దిల్లీ ఎందుకు వెళ్లారు?.. మెడలు వంచడానికా? మెడలు వంచుకొని రావడానికా?

సీఎం కేసీఆర్‌పై మండిపడ్డ కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

హైదరాబాద్‌: ధనిక రాష్ట్రం అని చెప్పుకొనే తెలంగాణ ప్రభుత్వం.. రైతుల కోసం రూ.5వేల కోట్లు వెచ్చించలేదా? అని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడారు. రైతులు రోడ్లపై పడిగాపులు కాస్తుంటే మంత్రులు ఎక్కడ ఉన్నారని నిలదీశారు.

‘‘మంత్రులకు సోయి లేదా? నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్ కల్లాలు తిరుగరా?  ముఖ్యమంత్రి కేసీఆర్ దిల్లీకి ఎందుకు వెళ్లారు? మెడలు వంచడానికా? మెడలు వంచుకొని రావడానికా? రైస్ మిల్లర్లతో కుమ్మకై కేసీఆర్ ఉద్దేశపూర్వకంగా రైతులకు అన్యాయం చేస్తున్నారు. రైతుకు ప్రభుత్వం స్వేచ్ఛ ఇవ్వాలి. ఏ పంటను పండించాలో రైతుకు వదిలిపెట్టాలి. కనీస మద్దతు ధర లేదు కాబట్టే ఇప్పుడు రైతులకు సమస్యలు వచ్చాయి. మాట్లాడితే... పంజాబ్ అనే ముఖ్యమంత్రి అక్కడి ప్రభుత్వం పనితీరు చూసి నేర్చుకోవాలి.  గత పదేళ్లుగా కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోంది. మార్కెట్‌ టర్నోవర్ అక్కడ రూ.10వేల కోట్లు ఉంటే.. ఇక్కడ వెయ్యి కోట్లు కూడా లేదు. విధానపరమైన నిర్ణయంపై ప్రభుత్వం ప్రకటన చేయాలి. నాలుగున్నరేళ్లు అవుతోంది.. రుణమాఫీ ఎక్కడికి పోయింది? రైతులకు రైతుబంధు ఒక్కటే సరిపోదు.

ఎప్పుడైతే ప్రధాని అపాయింట్‌మెంట్‌ అడగలేదో అప్పుడే వీరి నిజరూపం బయటపడింది. ప్రధాని అపాయింట్‌మెంట్‌ కోరకుండా ముఖ్యమంత్రి దిల్లీ ఎందుకు వెళ్లారు? కేంద్రం మనకు సహకారం ఇవ్వకపోతే దిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేద్దాం.  ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎప్పుడూ రాజకీయం మాత్రమే కావాలి.  సీఎం దిల్లీలో పడుకుంటే.. కలెక్టర్లు, మంత్రులు ఇక్కడ పడుకుంటున్నారు.  ప్రభుత్వానికి ఇంత నిద్రమత్తు ఉండడం రాష్ట్రానికి మంచిది కాదు. రూ.5 వేల కోట్లు కేటాయిస్తే రైతుల సమస్యలు తిరిపోతాయి. ముఖ్యమంత్రి చెప్తే తప్పా కలెక్టర్లు ఏం చేయడం లేదు’’ అని జీవన్‌రెడ్డి మండిపడ్డారు.


Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని