Priyanka Gandhi: ప్రజలకు ఇబ్బందులు కలిగించడంలో మోదీ ప్రభుత్వం రికార్డు..!

దేశంలో నిత్యం రికార్డు స్థాయిలో పెరిగిపోతోన్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై కాంగ్రెస్‌ నేత ప్రియాంకా గాంధీ మరోసారి మండిపడ్డారు.

Published : 24 Oct 2021 19:43 IST

కాంగ్రెస్‌ నేత ప్రియాంకా గాంధీ విమర్శలు

దిల్లీ: దేశంలో నిత్యం రికార్డు స్థాయిలో పెరిగిపోతోన్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై కాంగ్రెస్‌ నేత ప్రియాంకా గాంధీ మరోసారి మండిపడ్డారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించడంలో మోదీ ప్రభుత్వం రికార్డులు సృష్టిస్తోందని ఆరోపించారు. కేవలం ఈ ఒక్క ఏడాదిలోనే పెట్రోల్‌ ధర రూ.23 పెరగినట్లు వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలను ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

‘ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగించడంలో మోదీ ప్రభుత్వం రికార్డులు నమోదు చేసుకుంటోంది. మోదీ ప్రభుత్వంలోనే అత్యధిక నిరుద్యోగిత నమోదైంది. ప్రభుత్వ ఆస్తులను అమ్మేయడం కూడా మోదీ ప్రభుత్వ హయాంలోనే. ఒక్క ఏడాదిలోనే పెట్రోల్‌ ధరలు పెరిగిపోవడం ఈ ప్రభుత్వంలోనే’ అంటూ కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ ప్రియాంకా గాంధీ విమర్శించారు. ఇక కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా కూడా కేంద్ర ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు. పెట్రోల్‌ ధరల పెరుగుదలపై వచ్చిన వార్తలను పేర్కొంటూ ‘అచ్చే దిన్‌’ వచ్చాయంటూ వ్యంగాస్త్రాలు విసిరారు.

ఇదిలాఉంటే, దేశంలో వరుసగా ఐదో రోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగిపోయాయి. గతేడాది మే (2020) నుంచి ఇప్పటివరకు పెట్రోల్‌పై దాదాపు రూ.36 పెరగగా డీజిల్‌పై రూ.26 పెరిగింది. ప్రస్తుతం దేశంలో ప్రధాన నగరాల్లో పెట్రోల్‌ ధర రూ.110 దాటింది. లీటరు డీజిల్‌ ధర కూడా వందకు చేరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు