Politics: సోనియా గాంధీతో సిద్ధూ భేటీ!

ఇప్పటికే సీఎం అమరీందర్‌ సింగ్‌ కాంగ్రెస్‌ అధిష్ఠానాన్ని కలువగా.. తాజాగా రెబల్‌నేత నవజోత్‌సింగ్‌ కూడా కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Published : 16 Jul 2021 16:18 IST

పంజాబ్‌ కాంగ్రెస్‌లో కొనసాగుతోన్న అంతర్గత సంక్షోభం

దిల్లీ: పంజాబ్‌ కాంగ్రెస్‌లో చోటుచేసుకున్న అంతర్గత సంక్షోభానికి త్వరలోనే తెరపడనుందని భావిస్తోన్న తరుణంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు అక్కడి అగ్రనేతల మధ్య కోల్డ్‌వార్‌ మొదలు కావడంతో రంగంలోకి దిగిన అధిష్ఠానం.. వారిని బుజ్జగించే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే సీఎం అమరీందర్‌ సింగ్‌ కాంగ్రెస్‌ అధిష్ఠానాన్ని కలువగా.. తాజాగా రెబల్‌నేత నవ్‌జ్యోత్‌ సింగ్‌ సిద్ధూ కూడా కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

పంజాబ్‌ కాంగ్రెస్‌లో అంతర్గత సంక్షోభాన్ని తొలగించడంలో భాగంగా ముఖ్యమంత్రిగా అమరీందర్‌ సింగ్‌నే కొనసాగించడంతో పాటు పీసీసీ పగ్గాలు సిద్ధూకు అప్పజెప్పే ఫార్ములాను కాంగ్రెస్‌ అధిష్ఠానం అమలు చేస్తుందని అందరూ భావించారు. ఇదే విషయాన్ని పంజాబ్‌ కాంగ్రెస్‌ ఇంఛార్జ్‌గా ఉన్న హరీష్‌ రావత్‌ కూడా వెల్లడించారు. దీనిపై మరికొన్ని రోజుల్లోనే అధికారిక ప్రకటన వస్తుందని రెండురోజుల క్రితం పేర్కొన్నారు. కానీ, తాజాగా మాటమార్చిన హరీష్‌ రావత్‌, ఈ విషయంపై సోనియా గాంధీ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. దీంతో పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందనే విషయంపై ఆసక్తి నెలకొంది.

ఇక పంజాబ్‌ కాంగ్రెస్‌లో కీలక బాధ్యతలు సిద్ధూకు అప్పజెప్పడానికి ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ సుముఖంగా లేరు. ఇదే సమయంలో పీసీసీ పగ్గాలు ఆయనకే అప్పగిస్తారనే వార్తలు రావడంతో సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో గురువారం సాయంత్రం అమరీందర్‌ తన సన్నిహితులతో భేటీ కాగా.. అదే సమయంలో సిద్ధూ కూడా తన మద్దతుదారులతో సమావేశం నిర్వహించారు. దీంతో పార్టీలో మరోసారి వేడి వాతావరణం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో దిల్లీకి వెళ్లిన సిద్ధూ.. కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలతో భేటీ అయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని