Karnataka:ఈ పదవులేవీ శాశ్వతం కాదన్న బొమ్మై..సీఎం మార్పు ఊహాగానాలకుబలం

కర్ణాటకలో సీఎం మార్పుపై వినిపిస్తున్న ఊహాగానాల నేపథ్యంలో.. ఈ పదవులు, అధికారాలు ఏవీ శాశ్వతం కాదంటూ సీఎం బసవరాజ్‌ బొమ్మై చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి.....

Updated : 20 Dec 2021 01:28 IST

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తన సొంత నియోజకవర్గం షిగ్గాన్‌ ​ప్రజలతో ఆదివారం భావోద్వేగంగా మాట్లాడారు. పదవులు, అధికారాలు సహా ఈ సృష్టిలో మనకు ఏదీ శాశ్వతం కాదని ఆయన వ్యాఖ్యానించారు. అయితే కర్ణాటకలో సీఎం మార్పుపై ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో.. బొమ్మై వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. ఈ జీవితం ఎప్పటికీ ఉండదు. మనం ఇలా ఎంతకాలం ఉంటామో ఎవరికీ తెలియదు. ఈ పదవులు, అధికారాలు కూడా శాశ్వతం కావు. ఈ విషయాన్ని గుర్తుంచుకుని నేను ఎల్లప్పుడూ నడుచుకుంటా’ అని పేర్కొన్నారు.

షిగ్గాన్‌లో కిట్టూర్ రాణి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం బొమ్మై ఈ వ్యాఖ్యలు చేశారు. మీకెప్పటికీ నేను బసవరాజ్‌ను మాత్రమే. ముఖ్యమంత్రిని కాదు అని తన నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.‘నేను గతంలో హోంమంత్రి, సాగునీటి శాఖ మంత్రిగా పని చేశాను. కానీ, నేను ఎప్పుడు ఇక్కడకు వచ్చినా బసవరాజ్​ను మాత్రమే. ఎందుకంటే పదవుల కంటే బసవరాజ్ మాత్రమే శాశ్వతంగా ఉంటారు’ అని పేర్కొన్నారు.

నియోజకవర్గ ప్రజలు ఆప్యాయంగా తనకు రొట్టె, కొర్రల అన్నం తినిపించిన సందర్భాన్ని బసవరాజ్ బొమ్మై ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ‘గొప్ప విషయాలు చెప్పడానికి నా దగ్గర ఏమీ లేవు. మీరు ఆశించినట్లుగా నేను బతికితే.. అదే చాలు. మీ ప్రేమ, నమ్మకం కంటే గొప్పదైన అధికారం ఏదీ లేదు అని నేను నమ్ముతాను’ అని అన్నారు. ఇలా మాట్లాడాలని తాను అనుకోలేదని.. కానీ, ప్రజలను చూడగానే భావోద్వేగంగా మారిపోయానని చెప్పుకొచ్చారు. సీఎం బొమ్మై ప్రస్తుతం మోకాలి సంబంధిత సమస్యతో బాధపడుతున్నారని, ఈ చికిత్స కోసం విదేశాలకు వెళ్లనున్నారనే వార్తలు వస్తున్నాయి.  అయితే.. దీనిపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని