AP News: ఎన్టీఆర్‌ విగ్రహ ధ్వంసం తెలుగుజాతిని అవమానించినట్లే: నందమూరి రామకృష్ణ

తెదేపా వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ఓ వ్యక్తి యత్నించిన ఘటన గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం పరిధిలోని

Updated : 03 Jan 2022 13:10 IST

దుర్గి: తెదేపా వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ఓ వ్యక్తి యత్నించిన ఘటన గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం పరిధిలోని దుర్గిలో నిన్న కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఎన్టీఆర్‌ కుమారుడు నందమూరి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఎన్టీఆర్‌ విగ్రహ ధ్వంసం తెలుగు జాతిని అవమానించినట్లే. దుండగులను వెంటనే అరెస్టు చేయాలి. ఎన్టీఆర్‌ విగ్రహంపై చేయి వేస్తే తెలుగుజాతి ఊరుకోదు’’ అని హెచ్చరించారు.

ఎన్టీఆర్‌ విగ్రహం ధ్వంసానికి యత్నించిన నేపథ్యంలో తెదేపా ఆందోళనకు పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు దుర్గిలో 144సెక్షన్‌ విధించారు. పల్నాడు ప్రాంతంలో పలువురు తెదేపా నేతలను అరెస్టు చేశారు. కారంపూడి వద్ద తెదేపా నేత చిరుమామిళ్ల మధుబాబు, ఒప్పిచర్ల వద్ద జూలకంటి బ్రహ్మరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు- తెదేపా శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నరసరావుపేట తెదేపా ఇన్‌ఛార్జి చదలవాడ అరవింద్‌బాబును గృహనిర్బంధం చేశారు.

ఘటనను ఖండిస్తూ గుంటూరు చంద్రమౌళినగర్‌ ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద తెదేపా నిరసన కార్యక్రమం చేపట్టింది. కోవెలమూడి రవీంద్ర, రావిపాటి సాయికృష్ణ, పిల్లి మాణిక్యాల రావు, హనుమంతరావు, తెలుగు యువత, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు నిరసనలో పాల్గొన్నారు.

మరోవైపు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చిలకలూరిపేటలో మీడియా సమావేశం నిర్వహించారు. ‘‘రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు వైకాపా ప్రభుత్వం కుట్ర చేస్తోంది. ఎన్టీఆర్‌ విగ్రహ ధ్వంసం వైకాపా అరాచకాలకు నిదర్శనం. వైకాపా స్కీములన్నీ స్కాములే. రాష్ట్రంలో ప్రజల ధన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. అరాచకాలకు స్వస్తి చెప్పకపోతే ప్రజలు తిరగబడతారు’’ అని ప్రత్తిపాటి పుల్లారావు హెచ్చరించారు.

ఖండించిన జీవీఎల్‌..

ఎన్టీఆర్‌ విగ్రహం ధ్వంసానికి యత్నించడంపై భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు ఖండించారు. పల్నాడు పౌరుషాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన మహానటుడి విగ్రహాన్ని ధ్వంసం చేయడం బాధాకరమన్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని