Politics: ఒడిశాలో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ.. గుడ్‌బై చెప్పిన వర్కింగ్‌ ప్రెసిడెంట్‌!

వచ్చే ఏడాది పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్న వేళ కాంగ్రెస్‌ పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి.

Published : 22 Oct 2021 16:00 IST

భువనేశ్వర్: వచ్చే ఏడాది పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్న వేళ కాంగ్రెస్‌ పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. పలు రాష్ట్రాల్లో అంతర్గత విభేదాలతో ఇప్పటికే పార్టీ సతమతమవుతుండగా.. మరోవైపు పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఒడిశా ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పీసీసీ) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ప్రదీప్‌ మజీ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయన.. ఈ లేఖను పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపించినట్లు వెల్లడించారు. త్వరలోనే బిజూ జనతాదళ్‌ (BJD)లో చేరేందుకు ప్రదీప్‌ మజీ సిద్ధమైనట్లు తెలుస్తోంది.

మాజీ ఎంపీ అయిన ప్రదీప్‌ మజీకి ఒడిశాలోని నవరంగ్‌పూర్‌, మల్కాన్‌గిరి జిల్లాల్లో ప్రముఖ గిరిజన నేతగా పేరుంది. కాంగ్రెస్‌లో ఉండి ప్రజాసేవ చేయాలనుకున్నప్పటికీ ఆ పార్టీలో అటువంటి ఉత్సాహం కరవైందని ప్రదీప్‌ మజీ అభిప్రాయపడ్డారు. బలమైన నాయకత్వం పార్టీని ముందుండి నడిపించినప్పటికీ వివిధ స్థాయిల్లో కీలక పదవులను కొందరు అసమర్థ వ్యక్తులు ఆక్రమించుకోవడం వల్ల పార్టీ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందని అన్నారు. ప్రజల్లో కాంగ్రెస్‌ పార్టీ విశ్వసనీయత కోల్పోయిందన్న ఆయన.. తిరిగి బలాన్ని పొందడానికి సుదీర్ఘ సమయం పడుతుందన్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీని వీడుతున్నట్లు సోనియా గాంధీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.

మరికొన్ని రోజుల్లోనే అనుచరులతో కలిసి ప్రదీప్‌ మజీ బీజేడీలో చేరతారని ఆయన సన్నిహితులు వెల్లడించారు. అయితే, అంతకుముందు ఒడిశా పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న నబాకిశోర్‌ దాస్‌ కూడా 2019 ఎన్నికల ముందే కాంగ్రెస్‌ పార్టీని వీడి బీజేడీలో చేరారు. ఆ ఎన్నికల్లో గెలుపొందిన ఆయన.. ప్రస్తుతం అక్కడి ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని