Pawan kalyan: జీతాలు, పింఛన్లు ఏవి? ఆదాయం ఎటుపోతోంది?: పవన్‌

వైకాపా ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు సకాలంలో

Published : 09 Oct 2021 02:13 IST

అమరావతి: వైకాపా ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు సకాలంలో చెల్లించకపోవడం ప్రభుత్వానికి లోపించిన ఆర్థిక క్రమశిక్షణను తెలియజేస్తోందని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు వస్తాయనే మాటను మరిచిపోయే పరిస్థితికి తీసుకొచ్చారని ఆరోపించారు. ఎప్పుడు జీతాలు, పింఛన్లు వస్తాయో తెలియదని, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ గాడి తప్పడమే ఇందుకు కారణమని ఒక ప్రకటనటలో దుయ్యబట్టారు. విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు పింఛన్లు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. దశాబ్దాలపాటు సర్వీసు చేశాక విశ్రాంత జీవితాన్ని ప్రశాంతంగా గడపాలనుకకొంటారని... వృద్ధాప్యంలో వారికి వైద్య ఖర్చులు ఎక్కువగా ఉంటాయన్నారు. ఆ ఖర్చులకు పింఛను డబ్బులే ఆధారమని, వాటిని కూడా సకాలంలో ఇవ్వకపోతే మానసిక వేదనకు లోనవుతారని పేర్కొన్నారు.  

ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల కష్టాలు తనకు తెలుసునని.. జీతం, పింఛనుతో ఆత్మాభిమానంతో జీవిస్తారని అన్నారు. ఉద్యోగులు తమకు వచ్చే జీతాన్ని ప్రణాళికతో ఖర్చు చేసుకుంటారని, బ్యాంకు రుణాల వాయిదాలు, పిల్లల చదువుల ఖర్చులు, వైద్య అవసరాలు.. ఎన్నో ఉంటాయన్నారు. నిర్దేశిత సమయానికి జీతం ఇవ్వకపోతే ఎంతకాలం వారు చేబదుళ్లతో నెట్టుకురావాలని ప్రశ్నించారు. పోలీసు సిబ్బంది నిరంతరం విధుల్లో ఉంటారని, వారికి  11 నెలల నుంచి టీఏ చెల్లించడంలేదని, వారి సరెండర్‌ లీవులకు రావాల్సిన సొమ్ములు ఇవ్వలేదన్నారు. పోలీసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తన దృష్టికి రావడంతోనే అనంతపురం జిల్లా కొత్తచెరువు సభలో ప్రస్తావించానన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటి వరకు 7 డీఏలు బకాయిపడిందని, పీఆర్‌సీ అమలు చేయడం లేదని పేర్కొన్నారు. జీతం ఇవ్వడం ఆలస్యం చేస్తే  డీఏలు, టీఏలు, పీఆర్సీలు అడగరని... జీతం వస్తే అదే పదివేలు అనుకొంటారనే  ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి నెలా వచ్చే ఆదాయం గత ఆర్థిక సంవత్సరం కంటే పెరిగిందని లెక్కలు చెబుతున్నాయని, ప్రభుత్వ నిర్వహణలో భాగమైన జీతభత్యాల చెల్లింపులు చేయడం లేదంటే ప్రభుత్వ ఆదాయం ఎటుపోతోంది? అని పవన్‌ ప్రశ్నించారు. ప్రతి నెలా తీసుకొస్తున్న అప్పులు ఏమైపోతున్నాయని నిలదీశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని