Pawan kalyan: అవునవును.. ప్రభుత్వం అద్భుతాలే చేసింది: పవన్‌ కల్యాణ్‌ ఎద్దేవా

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రహదారుల దుస్థితిపై ప్రజల నుంచి ఉవ్వెత్తున నిరసన రావడంతో దాని నుంచి తప్పించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు..

Published : 08 Sep 2021 01:16 IST

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రహదారుల దుస్థితిపై ప్రజల నుంచి ఉవ్వెత్తున నిరసన రావడంతో దాని నుంచి తప్పించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్‌ రహదారులపై నిర్వహించిన సమీక్షలో.. ఎయిర్ పోర్టులు, షిప్పింగ్‌ యార్డుల అభివృద్ధి గురించి మాట్లాడటాన్ని పవన్‌ ప్రస్తావించారు. జనసేన పిలుపు మేరకు లక్షల మంది స్పందించి రోడ్ల దుస్థితిని తెలిపారన్నారు. ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య దెబ్బ తిన్న రహదారులని పేర్కొన్నారు. ‘సొంతిల్లు చిమ్ముకోవడానికి చీపురు లేదుగానీ పక్కిళ్లు చిమ్మేస్తాం.. కల్లాపు చల్లేస్తాం.. ముత్యాల ముగ్గులు పెట్టేస్తాం’ అన్న చందంగా రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో రోడ్లు నిర్మించాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనని.. ప్రజల దగ్గర నుంచి వసూలు చేస్తున్న పన్నులు ఎక్కడికి వెళ్తున్నాయని ప్రశ్నించారు. మంత్రులు అంటున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం అద్భుతాలే చేసిందని.. చిన్న గోతులను గొయ్యిల్లాగా.. గొయ్యిల్ని కాలువల్లా చేశారని విమర్శించారు. జనసేన పోరాటం ఆపబోమని.. ప్రజల పక్షాన రహదారులు మెరుగుపడే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని పవన్‌ స్పష్టం చేశారు. వినాయక చవితి ఉత్సవాలపై ఎందుకు నిషేధం విధించారో తనకు అర్థం కావడం లేదన్నారు. కొవిడ్ నిబంధనలు కేవలం చవితి పండగకు మాత్రమే వర్తిస్తాయా? వైకాపా ప్రజా ప్రతినిధులు, వారి కుటుంబసభ్యుల పుట్టిన రోజులకు వర్తించవా అని నిలదీశారు. చవితి వేడుకలపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని పవన్‌ డిమాండ్ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని