Ap News: ప్రభుత్వం స్పందించకపోవడం వల్లే సమస్య తీవ్రమైంది: పవన్‌ కల్యాణ్‌

విజయనగరం జిల్లా లచ్చయ్యపేట ఎన్‌సీఎస్‌ చక్కెర కర్మాగారం వద్ద బకాయిల కోసం నెల రోజుల నుంచి ఆందోళన చేస్తున్న రైతుల విషయంలో ప్రభుత్వం స్పందించకపోవడంతోనే సమస్య

Updated : 04 Nov 2021 15:40 IST

అమరావతి: విజయనగరం జిల్లా లచ్చయ్యపేట ఎన్‌సీఎస్‌ చక్కెర కర్మాగారం వద్ద బకాయిల కోసం నెల రోజుల నుంచి ఆందోళన చేస్తున్న రైతుల విషయంలో ప్రభుత్వం స్పందించకపోవడంతోనే సమస్య తీవ్రమైందని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ఆరోపించారు. ఈ మేరకు పవన్‌ కల్యాణ్‌ ప్రకటన విడుదల చేశారు. గత రెండేళ్లలో ఆ కర్మాగారం నుంచి రైతులకు రావాల్సిన రూ.16.38 కోట్ల బకాయిలను ఇప్పించేలా చూడాల్సిన పాలనా యంత్రాంగం ఈ సమస్యను శాంతిభద్రతల అంశంగా చూడటం భావ్యం కాదన్నారు. తీపిని పంచే చెరకు రైతుల జీవితాల్లో చేదు నిండుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకుల నిర్లక్ష్యం వల్ల ఆందోళన చేస్తున్న రైతులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతుంటే.. మరో వైపు రాజకీయ ఒత్తిళ్లతో పోలీసులు నలిగిపోతున్నారని అభిప్రాయపడ్డారు. రెండేళ్ల నుంచి రావాల్సిన బకాయిలను తక్షణమే ఇప్పించాల్సిన ప్రభుత్వం జనవరిలో ఇచ్చేలా యాజమాన్యాన్ని ఒప్పిస్తామని చెప్పడం రైతులను వంచించడమే అవుతుందన్నారు. ఈ సమస్యకు పరిష్కారం లభించే వరకు జనసేన నాయకులు రైతులకు అండగా ఉంటారని పేర్కొన్నారు.

గత రెండు సీజన్ల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చెరకు రైతులకు రూ.90 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయన్నారు. రైతులకు చక్కెర కర్మాగారాల నుంచి రావాల్సిన బకాయిలు వచ్చేలా సమన్వయం చేయాల్సిన అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రైతులకు 15 రోజుల్లోగా కర్మాగారం నుంచి డబ్బులు వచ్చేలా చూడాలని నిబంధనలు చెబుతున్నా.. రెండు సీజన్ల నుంచి బకాయిలు ఉన్నాయంటే ఎలా అర్థం చేసుకోవాలన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని