Pawan kalyan: రాష్ట్రంలో పరిణామాలపై కేంద్రం దృష్టిసారించాలి: పవన్‌ కల్యాణ్‌

తెదేపా కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడులను జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ఖండించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘పార్టీ కార్యాలయాలపై దాడి

Updated : 20 Oct 2021 13:33 IST

అమరావతి: తెదేపా కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడులను జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ఖండించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘పార్టీ కార్యాలయాలపై దాడి ప్రజాస్వామ్యానికి శ్రేయస్కరం కాదు. రాష్ట్ర చరిత్రలో ఇలాంటి దాడులు ఎన్నడూ జరగలేదు. రాష్ట్రంలో పరిణామాలపై కేంద్రం దృష్టి సారించాలి. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ నియంత్రణ అవసరం. వ్యక్తులు, పార్టీ కార్యాలయాలపై దాడులు అరాచకానికి దారి తీస్తాయి. భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు జరగకుండా చూడాలి. నిందితులను శిక్షించకపోతే రాష్ట్రం అరాచకానికి చిరునామాగా మారుతుంది’’ అని పవన్ కల్యాణ్ అన్నారు.

ఇదొక దుష్ట సంప్రదాయం: రామకృష్ణ

తెదేపా కార్యాలయాలు, నేతల ఇళ్లపై జరిగిన దాడిని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్ష పార్టీపై దాడులకు తెగబడటం దుష్ట సంప్రదాయమని అన్నారు. ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్య వ్యవస్థకు పెను విఘాతం కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

రాక్షసత్వం రాజ్యమేలుతోంది: దూళిపాళ్ల

ఆంధ్రప్రదేశ్‌లో రాక్షసత్వం రాజ్యమేలుతోందని తెదేపా సీనియర్‌ నేత ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. తెదేపా కేంద్ర కార్యాలయం, పార్టీ నాయకుల ఇళ్లు, కార్యాలయాలపై దాడి చేయడం అత్యంత హేయమైన చర్యగా పరిగణించారు. దాడులతో ప్రతిపక్ష నేతల గొంతులు నొక్కాలనుకోవటం అవివేకమన్నారు. దాడులకు పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దాడులకు పాల్పడిన వైకాపా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపించాయని.. తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్‌ చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు