Pawan Kalyan: చేతగాని వ్యక్తులు చట్టసభలో కూర్చోవడం దేనికి?: పవన్‌ కల్యాణ్‌

స్టీల్ ప్లాంట్‌ కార్మికులు, భూ నిర్వాసితులకు మద్దతుగా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేపట్టిన ఒక రోజు దీక్ష ముగిసింది. పార్టీ

Updated : 12 Dec 2021 20:42 IST

అమరావతి: స్టీల్ ప్లాంట్‌ కార్మికులు, భూ నిర్వాసితులకు మద్దతుగా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేపట్టిన ఒక రోజు దీక్ష ముగిసింది. పార్టీ నేతలు ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ... స్టీ్‌ల్‌ ప్లాంట్‌ విషయంలో వైకాపా తీరును ఎండగట్టారు.

‘‘సమస్యలు, కష్టాలు వచ్చినప్పుడే జనసేన గుర్తొస్తుంది. రేపు ఓటేసేటప్పుడు కూడా జనసేన గుర్తుకు రావాలని కోరుకుంటున్నా. ఏ ప్రతిఫలం ఆశించకుండా సర్వస్వం త్యాగం చేసిన మహనీయులే మనకు ప్రేరణ. పనిచేసే క్రమంలో పదవి రావాలి.. పదవి కోసం పనిచేయొద్దు. అందుకే ఈరోజు గాజువాకలో ఓడిపోయినా, ఉత్తరాంధ్రలో గెలవలేకపోయినా, ఆంధ్రప్రదేశ్‌లో మద్దతు సంపూర్ణంగా రానప్పటికీ ఎందుకు నిలబడి ఉన్నామంటే ప్రజాక్షేమం కోరుకున్న వాళ్లం. కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా ఉన్నామని చెప్పడం కోసమే. వైకాపా నేతలు జనసేనకు శత్రువులు కాదు. వారి విధానాలకు మాత్రమే వ్యతిరేకం. అమరావతిని రాజధానిగా గుర్తిస్తామని అమిత్‌ షా నాతో అన్నారు. ప్రధాని మోదీతో గొడవ పెట్టుకోవాలని వైకాపా నేతలు అంటున్నారు. విలువలు లేని వైకాపాకు రాజ్యాంగం విలువ తెలియదు. నాకు ప్రజా బలం ఉంది.. కానీ చట్టసభల్లో లేదు. వైకాపాకు 22 మంది ఎంపీలు ఉన్నారు. చేతగాని వాళ్లు చట్టసభలో ఎందుకు?. వైకాపా ఎంపీలకు చిత్తశుద్ధి ఉంటే ..విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను అడ్డకుంటామని పార్లమెంట్‌లో ప్లకార్డు పట్టుకునే దమ్ముందా? జగన్‌ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట.. అధికారంలోకి వచ్చిన తర్వాత మరొక మాట మాట్లాడుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో అందరూ ఏకం కావాలి. కార్పొరేషన్‌ ఎన్నికల్లో స్టీల్‌ ప్లాంట్ కాపాడతామని చెబుతున్నారు. విశాఖ కార్పొరేషన్‌ ఎన్నికలు ముగిసిన తర్వాత ఆ ఊసెత్తరు. అందరూ కలిసి వైకాపా నేతలను చొక్కా పట్టుకుని నిలదీయక పోతే వాళ్లు మాట వినరు. జనసేనకు మద్దతిస్తే నేను చేసి చూపిస్తా.  2024 ఎన్నికల వరకు వైకాపా గూండాయిజం, బూతులు భరించాల్సిందే. ఆలోచించి ఓటు వేయకపోతే, విలువ తెలియకుండా అమ్ముకుంటే ప్రజల స్వయంకృతాపరాధమే’’ అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

అప్పు ఉందని ఆంధ్రప్రదేశ్‌ను ప్రైవేటీకరణ చేస్తారా?

‘‘నేను ఒక్కడినే గెలిచేందుకు రాజకీయాల్లోకి రాలేదు. నా ఒక్కడి కోసమైతే ఏదో ఒక పార్టీలో చేరి కేంద్ర మంత్రిని కాగలను. కానీ, అలా కాదు.. ఒక తరం గెలవాలి. పాతిక కేజీల బియ్యం కాదు.. పాతికేళ్ల భవిష్యత్‌ కావాలి. ప్రత్యేక హోదాకోసం నేను పోరాడితే జనం మద్దతివ్వలేదు. 2014లో నన్ను ఒక ఐడియలిస్టిక్‌ ఫూల్‌గా చూశారు. జనం చప్పట్లు కొట్టేసి వెళ్లిపోతే సమస్యలు పరిష్కారం కావు. యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసి గద్దెనెక్కారు. ఉద్యోగ సంఘాల నేతలు వైకాపా నేతల చొక్కాలు పట్టుకుని నిలదీయాలి. ఓట్లు వేయించుకున్న వైకాపాకు స్టీల్‌ ప్లాంట్‌ బాధ్యత లేదా?. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కోసం అమరావతిలో దీక్ష ఏంటని అంటున్నారు.  వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ఆవిర్భావానికి గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే అమృతరావు కారణం. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న సమస్యను ఎక్కడి నుంచైనా ప్రస్తావిస్తాం. విశాఖ నుంచి మాట్లాడితే వైకాపాకు వినిపించలేదు. మంగళగిరి నుంచి మాట్లాడితేనైనా వైకాపా నాయకత్వానికి వినిపిస్తుందేమో. స్టీల్‌ ప్లాంట్‌కు 22వేల కోట్లు అప్పు ఉందంటున్నారు. అప్పు ఉందని ప్రభుత్వ సంస్థలను అమ్మేస్తారా?ప్రైవేటీకరణకు అప్పు అనేది ప్రాతిపదిక అయితే.. ఆంధ్రప్రదేశ్‌కు ఈరోజున రూ.6లక్షల కోట్ల అప్పు ఉంది. మరి ఆంధ్రప్రదేశ్‌ను కూడా ప్రైవేటీకరణ చేస్తారా? గతంలో పాదయాత్ర చేశారుగా ఇప్పుడు స్టీల్‌ ప్లాంట్‌ కోసం చేయండి. నేను కూడా మద్దతిస్తా’’

స్మారకం కట్టలేని వాళ్లు కర్నూలు రాజధాని అంటే నమ్మాలా?

‘‘ఓటు అనే చినుకును వైకాపా పెనంపై వేసి జీవితాలను ఆవిరి చేశారు. ఓటు అనే చినుకును జనసేన అనే ఆల్చిప్పలో వేయండి. మీ జీవితాలు మెరుస్తాయి. మంచి మనుషులు ఏ పార్టీలో ఉన్నా నేను ప్రేరణగా తీసుకుంటా? రాయలసీమ నుంచి ఎక్కువ మంది ముఖ్యమంత్రులు వచ్చారు. దామోదరం సంజీవయ్యకు చిన్న స్మారక భవనం కూడా నిర్మించలేదు. సంజీవయ్య స్మారకానికి నేను రూ.కోటి ఇచ్చా. దామోదరం సంజీవయ్యకు చిన్న స్మారకం నిర్మించలేని వారు.. కర్నూలు రాజధానిగా చేస్తామంటే నమ్మాలా? మహిళలు, బీసీల సాధికారిత కోసం ఎన్టీఆర్ కృషి చేశారు. వారసత్వ రాజకీయాలను పక్కనపెట్టిన మోదీ అంటే గౌరవం’’

నా సినిమాలు ఉచితంగా చూపిస్తా!

‘‘నా సినిమాలు ఆపేసి,  నా ఆర్థిక మూలాలు దెబ్బకొట్టాలని చూశారు. నా సినిమాలు ఆపేసినా నేను భయపడను. పంతానికి దిగితే ఆంధ్రప్రదేశ్‌లో నా సినిమాలు ఉచితంగా చూపిస్తా. సినిమా టికెట్లకు పారదర్శకత లేదంటున్నారు.. మీరు అమ్మే మద్యానికి పారదర్శకత ఉందా? రూ.700లతో మద్యం కొనండి, రూ.5తో సినిమాకు వెళ్లండి. వైకాపా దౌర్జన్యాలు, అక్రమాలు ఎండగట్టాలి. వైకాపా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక్క ప్రాజెక్టు అయినా ప్రారంభించారా...కనీసం శిలాఫలకం అయినా పెట్టారా?’’ అని పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారు.

వైకాపా ఆంధ్రప్రదేశ్‌ ఆరోగ్యానికి హానికరం
‘‘మోదీ సదుద్దేశంతో వ్యవసాయ చట్టాలు చేశారు. ప్రజలు వ్యతిరేకిస్తే 3 చట్టాలను వెనక్కి తీసుకుని మోదీ క్షమాపణ చెప్పారు. అమరావతి రైతులు పాదయాత్రలో జై అమరావతితో పాటు జై ఆంధ్ర అని నినదించండి. జనసేన ఎప్పుడూ ఒక కులాన్ని వర్గ శత్రవుగా భావంచదు. జనసేన మత రాజకీయాలు చెయ్యదు. పోరాటం ద్వారా వైకాపాను కూడా ఒత్తిడిలోకి నెట్టాలి. ప్రజలు బలంగా నిలబడితే దిల్లీ వరకు వెళ్లి మేం పోరాడుతాం.రౌడీ యిజంలో యూపీ, బిహార్‌ను ఆంధ్రప్రదేశ్‌ మించిపోయింది. ఎమ్మెల్యేలే రౌడీయిజం చేసే స్థాయికి చేరారు. శాసనాలు చేసే చట్ట సభలో బూతులు మాట్లాడుతున్నారు. విపక్ష నేత భార్యనే అసెంబ్లీలో దూషిస్తే.. వీధిలో మహిళలకు రక్షణ ఏముంటుంది?. వైకాపా ఆంధ్రప్రదేశ్‌ ఆరోగ్యానికి హానికరం. 2024లో వచ్చే కొత్త ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతివ్వాలి’’ అని పవన్‌ కోరారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని