Perni Nani: పవన్‌ తీరుపై చిరంజీవి విచారం వ్యక్తం చేశారు: పేర్నినాని

చిత్ర పరిశ్రమల నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, అందుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చొరవ చూపాలని పలువురు సినీ ప్రముఖులు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.

Updated : 30 Sep 2021 10:16 IST

మచిలీపట్నం: చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, అందుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చొరవ చూపాలని పలువురు సినీ ప్రముఖులు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సినీ ప్రముఖులు దిల్‌ రాజు, డి.వి.వి.దానయ్య, బన్నీ వాసు, సునీల్‌ నారంగ్‌ తదితరులు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఏపీ సినిమాటోగ్రఫీశాఖ మంత్రి పేర్నినానితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పేర్నినాని మాట్లాడుతూ.. సినీపరిశ్రమకు నష్టం జరిగే సంఘటనలు ఉత్పన్నమవుతున్నందునే నిర్మాతలు తనతో సమావేశమయ్యారని తెలిపారు. సినిమా పరిశ్రమను బతికించేందుకు ప్రభుత్వం ఇచ్చే సూచనలు, సలహాలు పాటించేందుకు సిద్ధమని చెప్పారని తెలిపారు. ‘ఆన్‌లైన్‌ టికెటింగ్‌ విధానంపై సినీ పరిశ్రమ సానుకూలంగా ఉంది. సినీ పరిశ్రమ ఏకతాటిపై ఉన్నట్టు సీఎంతో చెప్పాలని కోరారు. ఆన్‌లైన్‌ టికెట్లపై అనుకూలమని నిర్మాతలు చెప్పారు. ఇప్పటికే పోర్టళ్లు, ఆన్‌లైన్‌లో టికెట్ల అమ్మకం జరుగుతోంది. కొన్ని చోట్ల 90శాతం టికెట్లు ఆన్‌లైన్‌లో అమ్ముతున్నారు. సినీ పరిశ్రమకు నష్టం జరిగే ఘటనలు ఉత్పన్నమవుతున్నట్టు చెప్పారు. ప్రభుత్వం నిర్వహించిన గత భేటీపై అందరూ సంతృప్తిగా ఉన్నారు. పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలకు, సినీ పరిశ్రమకు సంబంధం లేదని నిర్మాతలు చెప్పారు. పవన్‌ వ్యాఖ్యలతో బాధపడినట్టు నిర్మాతలు తెలిపారు. చిరంజీవి కూడా నాతో మాట్లాడారు. ‘రిపబ్లిక్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో పవన్‌ కల్యాణ్‌ మాట్లాడిన తీరుపై ఆయన విచారం వ్యక్తం చేశారు. పవన్‌ వ్యాఖ్యలతో చిత్ర పరిశ్రమకి సంబంధం లేదని చెప్పారు’ అని పేర్ని నాని తెలిపారు.

నిర్మాత దిల్‌ రాజు మాట్లాడుతూ.. ‘చిత్ర పరిశ్రమను వివాదాల్లోకి లాగొద్దు. సినిమా టికెట్ల రేట్లు పెంచమని మేమే కోరాం. దాని గురించి గత సమావేశంలో చర్చించాం. చిరంజీవి, నాగార్జున, రాజమౌళితో కలిసి గతంలోనే సీఎంను కలిశాం. పరిశ్రమపై కొవిడ్‌ ప్రభావం..సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లాం. దయచేసి అందరూ వివాదాలకు మమ్మల్ని దూరంగా ఉంచండి. గతంలో మా విజ్ఞప్తిపై ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఆన్‌లైన్‌ విధానం కావాలని పరిశ్రమ తరఫున మేమే ప్రభుత్వాన్ని కోరాం. ఆన్‌లైన్‌ విధానం పారదర్శకంగా ఉంటుంది. మంత్రి నాని సానుకూలంగా స్పందించారు. దాన్ని పూర్తి స్థాయిలో సినీ పరిశ్రమకి వివరించలేకపోయాం. అందుకే ఇలాంటి పరిస్థితి ఎదురైంది. అనుకోని పరిణామాలు జరుగుతున్నాయి’  అని పేర్కొన్నారు. 

పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలకి మంత్రి కౌంటర్‌

మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన విస్తృతస్థాయి సమావేశంలో పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై పేర్ని నాని స్పందించారు. భారతదేశంలో తొలిసారి కిరాయి రాజకీయ పార్టీ పెట్టిన వ్యక్తి పవన్‌ కల్యాణ్ అని ఏపీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. ‘‘రాజకీయ పార్టీలకు టెంట్‌ హౌస్‌ పెట్టిన వ్యక్తి పవన్‌.  నేను బూతులు తిట్టలేదు కాబట్టే టీవీలో నా ప్రెస్‌ మీట్‌ ప్రసారం చేశారు. నన్ను అవమానించాలని చూస్తే.. ఆ అవమానాన్ని పరిచయం చేస్తా’’ అని పేర్ని నాని హెచ్చరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని