Congress hits out Modi Speech: ఏడేళ్ల నుంచీ ప్రధానిది అదే ప్రసంగం..!

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చేసే ప్రసంగంలో ప్రధానమంత్రి పలు కొత్త పథకాలపై ప్రకటనలు చేస్తున్నప్పటికీ వాటిని అమలు చేయడం లేదని కాంగ్రెస్‌ పార్టీ పేర్కొంది.

Published : 16 Aug 2021 01:47 IST

ప్రధానమంత్రిపై కాంగ్రెస్‌ విమర్శలు

దిల్లీ: స్వాతంత్ర్యదినోత్సవ సందర్భంగా చేసే ప్రసంగంలో ప్రధానమంత్రి పలు కొత్త పథకాలపై ప్రకటనలు చేస్తున్నప్పటికీ వాటిని అమలు చేయడం లేదని కాంగ్రెస్‌ విమర్శించింది. అంతేకాకుండా కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను తిరిగి వెనక్కి తీసుకోకపోవడంపై విమర్శలు గుప్పించింది. గడిచిన ఏడేళ్ల నుంచి ప్రధాని ఒకేవిధమైన ప్రసంగం చేస్తున్నారని.. చిన్న, సన్నకారు రైతులతో పాటు అణగారిన వర్గాలకు ప్రభుత్వం చేస్తుందేమీ లేదని దుయ్యబట్టింది.

‘స్వాతంత్ర్యదినోత్సవ ప్రసంగంలో ప్రధానమంత్రి ప్రతిఏటా కొత్త పథకాలను ప్రకటిస్తారు. కానీ, క్షేత్ర స్థాయిలో వాటి అమలు మాత్రం ఉండదు. అంతేకాకుండా నూతన సాగు చట్టాలను తీసుకురావడంతో వారిని మరింత దుర్భర పరిస్థితుల్లోకి నెట్టివేశారు’ అని ప్రధాని మోదీపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లిఖార్జున ఖర్గే విమర్శించారు. ఇంతకుముందు ప్రభుత్వాల హయాంలో చిన్న, సన్నకారు రైతులు, అభివృద్ధిపై విమర్శలు చేస్తోన్న మోదీ.. కాంగ్రెస్‌ పార్టీపై నిందలు వేసినంత మాత్రాన దేశాభివృద్ధి జరగదని అన్నారు. యూపీఏ అధికారంలో ఉన్న కాలంలో రైతులకు సాగునీటి వ్యవస్థలను అందించడంతో పాటు రుణమాఫీ చేసిన విషయాన్ని మల్లిఖార్జున ఖర్గే గుర్తుచేశారు.

ఇక ఎర్రకోటపై ప్రధానమంత్రి చేసిన ప్రసంగంపై స్పందించిన కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా.. రూ.100లక్షల కోట్ల పెట్టుబడి ప్రణాళిక ప్రకటనపై విమర్శలు గుప్పించారు. రెండేళ్ల క్రితం కూడా ప్రధాని ఇదే ప్రకటన చేశారని అన్నారు. 2019 స్వాతంత్ర్య దినోత్సవం నాడు ప్రధాని ప్రసంగించిన వీడియోను ట్విటర్‌లో పోస్టు చేశారు. ఒకవేళ వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని ప్రకటిస్తే..ఈ రోజు చారిత్రాత్మక దినంగా మిగిలిపోయేదని కాంగ్రెస్‌ నేత ప్రతాప్‌ సింగ్‌ బాజ్వా అభిప్రాయపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని