Rahul Gandhi: ‘వ్యక్తిగత ఇమేజ్‌’ కోసమే ప్రధాని ఆరాటం..: కాంగ్రెస్‌ విమర్శ

చైనా నుంచి చొరబాట్లు ఎక్కువవుతున్నట్లు వార్తలు వస్తున్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ మౌనంగా ఉంటున్నారంటూ కాంగ్రెస్‌ పార్టీ విమర్శలు గుప్పించింది.

Published : 13 Oct 2021 02:03 IST

చైనా చొరబాట్లపై స్పందించడం లేదంటూ ఆగ్రహం

దిల్లీ: చైనా నుంచి చొరబాట్లు ఎక్కువవుతున్నట్లు వార్తలు వస్తున్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ మౌనంగా ఉంటున్నారంటూ కాంగ్రెస్‌ పార్టీ విమర్శలు గుప్పించింది. దేశ సరిహద్దులను కాపాడడం కంటే తనకు తాను సృష్టించుకున్న కృత్రిమ ఇమేజ్‌ కోసమే ప్రధానమంత్రి ఎక్కువ ఆందోళన చెందుతున్నారని ఆరోపించింది. చైనా నుంచి చొరబాట్లు పెరుగుతున్నప్పటికీ ఎరుపెక్కిన కళ్లతో డ్రాగన్‌ వైపు ఎందుకు చూడడం లేదని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు. కమాండర్‌ స్థాయిలో చర్చలు జరిగినప్పటికీ సరిహద్దు నుంచి చైనా బలగాలు వెనక్కి వెళ్లడం లేదంటూ వస్తోన్న వార్తలను ప్రస్తావిస్తూ.. ట్విటర్‌లో రాహుల్‌ గాంధీ విమర్శలు చేశారు.

బలమైన భారత్‌కు బలమైన సైన్యం ఉన్నప్పటికీ బలహీనమైన ప్రధానమంత్రి ఉన్నారంటూ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి పవన్‌ ఖేరా తీవ్ర విమర్శలు చేశారు. ఇంత జరుగుతున్నా ప్రధానమంత్రి కనీసం చైనా పేరు ఎత్తేందుకు సిద్ధంగా లేరని విమర్శించారు. సరిహద్దుల్లో ఎదురవుతున్న సవాళ్ల నుంచి దేశాన్ని కాపాడడం కంటే వ్యక్తిగత ఇమేజ్‌ కోసమే ప్రధాని ఎక్కువ ఆందోళన చెందుతున్నారని ఆరోపించారు. భారత్‌ భూభాగంలో చొరబడిన చైనా సైన్యం.. వెనక్కి వెళ్లమని చెబుతున్నప్పటికీ ప్రధానమంత్రి స్పందించకపోవడం రాజకీయ సంకల్ప లేమిని స్పష్టంగా చూపిస్తోందన్నారు.

ఇక ఇరు దేశాల కోర్‌కమాండర్ల స్థాయిలో 13వసారి చర్చలు జరిగినప్పటికీ సరిహద్దుపై ప్రతిష్టంభన తొలగిపోలేదు. ఇదే సమయంలో చైనా బలగాలు చొరబాట్లకు పాల్పడుతూనే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ అంశంపై  ప్రధానమంత్రి, రక్షణ మంత్రితో పాటు విదేశీ వ్యవహారాలశాఖ మంత్రులు మౌనంగా ఉంటున్నారని కాంగ్రెస్‌ విమర్శిస్తోంది. ఈ చొరబాట్లకు చైనాను బాధ్యులుగా చేసేందుకు ప్రధానికి నోటిమాట రావడం లేదని.. చైనా పేరు ఎత్తాలంటేనే ప్రధాని భయపడుతున్నారని ఆరోపించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని