Pegasus: ఫ్రాన్స్‌, ఇజ్రాయెల్‌ దర్యాప్తు చేస్తునప్పుడు భారత్‌ ఎందుకు చేయదు.?

పెగాసస్‌ స్పైవేర్‌ సహాయంతో ప్రముఖుల ఫోన్లు హ్యాకింగ్‌కు గురయ్యాయని వచ్చిన ఆరోపణలపై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీతో దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పీ చిదంబరం డిమాండ్‌ చేశారు.

Updated : 26 Jul 2021 05:03 IST

కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పీ చిదంబరం

దిల్లీ: పెగాసస్‌ స్పైవేర్‌ సహాయంతో ప్రముఖుల ఫోన్లు హ్యాకింగ్‌కు గురయ్యాయని వచ్చిన నివేదికలతో భారత్‌లో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీతో లేదా సుప్రీం కోర్టు సిట్టింగ్‌ జడ్జితో దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి.చిదంబరం డిమాండ్‌ చేశారు. ప్రముఖుల నంబర్లపై హ్యాకింగ్‌ జరిగిందా? లేదా? అనే అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పార్లమెంటులో క్లారిటీ ఇవ్వాలని పేర్కొన్నారు. అంతేకాకుండా ఫ్రాన్స్‌, ఇజ్రాయెల్‌ వంటి దేశాలు దర్యాప్తునకు ఆదేశించినప్పుడు.. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపేందుకు భారత్‌కు ఎందుకు ముందుకెళ్లడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని చిదంబరం ప్రశ్నించారు.

పెగాసస్‌ హ్యాకింగ్‌ ఉదంతాన్ని పార్లమెంటరీ ఐటీ ప్యానెల్‌ ఇప్పటికే పరిశీలిస్తున్నందున జేపీసీ (సంయుక్త పార్లమెంటరీ కమిటీ) అవసరం లేదని కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌ ఈ మధ్యే పేర్కొన్నారు. దీనిపై స్పందించిన చిదంబరం, ఐటీ ప్యానెల్‌లో సింహభాగం భాజపా సభ్యులే ఉన్నారని.. అందుకే దర్యాప్తు లోతుగా జరపనిస్తారో లేదోననే అనుమానం వ్యక్తం చేశారు. అయినా పార్లమెంటరీ ఐటీ ప్యానెల్‌ పరిశీలనను స్వాగతిస్తున్నానని చెప్పారు. అయితే, 2019లో జరిగిన ఎన్నికలపై చట్టవిరుద్ధమైన హ్యాకింగ్‌ తీవ్ర ప్రభావం చూపించిందని చెప్పలేమని.. కానీ, భాజపా విజయం సాధించడంలో ఇది దోహదం చేసి ఉండవచ్చని చిదంబరం అభిప్రాయపడ్డారు.  పెగాసస్‌ ఉదంతంపై కేంద్ర ప్రభుత్వం ఆచితూచి స్పందిస్తోందన్న ఆయన.. ప్రముఖుల నంబర్లపై నిఘా పెట్టినట్లు వచ్చిన వార్తలను హోంమంత్రి అమిత్‌ షా ఖండించలేదని గుర్తుచేశారు. దీనిపై పార్లమెంటులో దుమారం చెలరేగుతోన్న సయమంలో అసలు హ్యాకింగ్‌ జరిగిందా? లేదా అనే విషయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

పెగాసస్‌ కూడా హిరోషిమా వంటిదే.. శివసేన

దేశంలో పెగాసస్‌ సహాయంతో రాజకీయ నాయకులు, జర్నలిస్టులతో పాటు ఇతర ప్రముఖులపై గూఢచర్యం జరిగిందంటూ వస్తోన్న ఆరోపణలు ప్రజాస్వామ్యంపై దాడి అని రాజ్యసభ సభ్యుడు, శివసేన నేత సంజయ్‌ రౌత్‌ పేర్కొన్నారు. ఈ ఉదంతాన్ని జపాన్‌లోని హిరోషిమా దాడితో పోల్చిన ఆయన.. ఆ దాడిలో ప్రజలు ప్రాణాలు కోల్పోగా.. పెగాసస్‌ స్పైవేర్‌ చేతుల్లో స్వేచ్ఛ హరించిపోయిందని అభిప్రాయపడ్డారు. అయితే, ఇజ్రాయెల్‌ కంపెనీ నుంచి పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ లైసెన్సు కోసం చెల్లింపులు ఎవరు చేశారని ప్రశ్నించారు. 50 నంబర్లను హ్యాక్‌ చేయడానికి ఒక్కో లైసెన్సుకు దాదాపు రూ.60కోట్లు ఖర్చు అవుతుందని.. అలాంటిది రూ.300కోట్లు పెట్టి ఏ ప్రభుత్వం దీనిని కొనుగోలు చేసిందని అడిగారు. ఒకవేళ ఇది నిజమే అయితే, కేవలం గూఢచర్యం కోసమే ఇంత మొత్తం ఖర్చు చేసే ఆర్థిక స్తోమత మన ప్రభుత్వానికి ఉందా అని సంజయ్‌ రౌత్‌ ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని