PM slams Opposition: ‘సెల్ఫ్‌గోల్‌’ కోసమే విపక్షాల ప్రయత్నాలు..!

వివిధ రంగాల్లో దేశం ఎంతో ప్రగతి సాధిస్తోందన్న మోదీ.. దేశయువత గోల్‌ తర్వాత గోల్‌ చేసుకుంటూ ముందుకు వెళ్తోందని ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు విజయాన్ని ప్రస్తావించారు.

Published : 06 Aug 2021 01:54 IST

విపక్ష పార్టీల తీరుపై విరుచుకుపడ్డ ప్రధాని మోదీ

లఖ్‌నవూ: పెగాసస్‌తో పాటు ఇతర అంశాలపై చర్చ జరపాలని పార్లమెంటులో విపక్షాలు చేస్తోన్న ఆందోళనలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. వివిధ రంగాల్లో దేశం ఎంతో ప్రగతి సాధిస్తోందన్న మోదీ.. దేశయువత గోల్‌ తర్వాత గోల్‌ చేసుకుంటూ ముందుకు వెళ్తోందని ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు విజయాన్ని ప్రస్తావించారు. మరోవైపు కొందరు మాత్రం తమ రాజకీయ ఎజెండాను అమలుచేసేందుకు ‘సెల్ఫ్‌ గోల్‌’ కోసం ప్రయత్నిస్తున్నారని విపక్షాలపై పరోక్ష విమర్శలు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్నయోజన అవగాహన కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్న మోదీ, విపక్షాల తీరును ఎండగట్టారు.

దేశం ఏం కోరుకుంటోంది, ఏం సాధిస్తోంది, దేశంలో ఏవిధమైన మార్పులు వస్తున్నాయనే విషయాలు ప్రతిపక్షాలకు అవసరం లేదని ప్రధాని మోదీ విమర్శించారు. ఆందోళన చేస్తోన్న విపక్ష పార్టీలవి జాతి వ్యతిరేక కార్యకలాపాలేనని.. అభివృద్ధి మార్గాన్ని అడ్డుకోవడమే వారి ముఖ్య ఉద్దేశమని దుయ్యబట్టారు. అయినప్పటికీ దేశాన్ని ముందుకు సాగకుండా వారు ఆపలేరని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా డబుల్ ఇంజిన్‌ ప్రభుత్వంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. దేశంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉండడం (Double Engine) వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని రేషన్‌ లబ్ధిదారులతో మాట్లాడుతున్న సందర్భంలో ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు.

ఇదిలాఉంటే, పెగాసస్‌ అంశంపై చర్చించాలని డిమాండ్‌ చేస్తూ దాదాపు రెండు వారాలుగా ప్రతిపక్షాలు చేస్తోన్న ఆందోళనలు పార్లమెంటును, రాజ్యాంగాన్ని అవమానించేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు ఎంపీలు పేపర్లు చింపి సభాధ్యక్షుల స్థానాల వైపు గాల్లోకి విసిరిన ఘటనలపైనా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు సమావేశాలను అడ్డుకుంటూ విపక్ష సభ్యులు అప్రజాస్వామ్య రీతిలో ప్రవర్తిస్తున్నారని ప్రధానమంత్రి విమర్శలు గుప్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని