Prashant Kishor: పంజాబ్‌ సీఎం సలహాదారుగా పీకే రాజీనామా.. కాంగ్రెస్‌లో చేరిక ఖాయమేనా?

పంజాబ్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌కు ప్రధాన సలహాదారుగా ఉన్న ప్రముఖ రాజకీయ

Published : 05 Aug 2021 12:21 IST

చండీగఢ్‌: పంజాబ్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌కు ప్రధాన సలహాదారుగా ఉన్న ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ప్రజాజీవితంలో క్రియాశీల పాత్ర నుంచి కొంత విరామం తీసుకోవాలనే ఉద్దేశంతోనే ప్రధాన సలహాదారు పదవికి రాజీనామా చేస్తున్నట్లు పీకే చెప్పారు. ఈ మేరకు సీఎంకు లేఖ రాశారు.

‘‘ప్రజా జీవితంలో క్రియాశీల పాత్ర నుంచి కొద్ది రోజులు తాత్కాలిక విరామం తీసుకోవాలని నేను నిర్ణయం తీసుకున్నట్లు మీకు తెలుసు. అందువల్ల మీ ప్రధాన సలహాదారు బాధ్యతలను నేను చేపట్టలేకపోతున్నా. నా భవిష్యత్‌ కార్యాచరణపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అందువల్ల ఈ బాధ్యతల నుంచి నన్ను రిలీవ్‌ చేయాలని కోరుతున్నా. మీ సలహాదారుగా నన్ను ఎంచుకున్నందుకు కృతజ్ఞతలు’’ అని సీఎంకు రాసిన లేఖలో ప్రశాంత్‌ కిశోర్‌ పేర్కొన్నారు. 

కాగా.. ప్రశాంత్‌ కిశోర్‌ కాంగ్రెస్‌లో చేరనున్నట్లు గత కొంతకాలంగా జోరుగా ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలు అనేక ఊహాగానాలకు తావిస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకే పీకే ప్రధాన సలహాదారు బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారని రాజకీయ వర్గాల్లో వినికిడి. అయితే దీనిపై అటు పీకే గానీ.. ఇటు కాంగ్రెస్‌ గానీ ఇంతవరకూ స్పందించలేదు. 

ఈ ఏడాది మార్చిలో పీకే.. అమరీంద్‌ సింగ్‌ ప్రధాన సలహాదారుగా నియమితులయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా సీఎం ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ఆయనకు కేబినెట్‌ హోదా కల్పిస్తూ ఈ పదవిలోకి తీసుకున్నారు. 2022 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ప్రశాంత్ కిశోర్‌ను అమరీందర్‌ తన సలహాదారుగా నియమించుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. 2017 ఎన్నికల్లో పంజాబ్‌లో కాంగ్రెస్‌ గెలుపునకు అమరీందర్‌- పీకే కలిసి పనిచేశారు. అంతేగాక, ఇటీవల పంజాబ్‌ కాంగ్రెస్‌లో నెలకొన్న కెప్టెన్‌- సిద్ధూ సమస్య పరిష్కారంలో పీకే క్రియాశీలకంగా పనిచేశారు.

అయితే గత నెల పీకే.. కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలతో సమావేశమయ్యారు. జులై 13న రాహుల్‌ నివాసంలో సమావేశమైన వీరు దాదాపు మూడు గంటలకుపైగా సుదీర్ఘ మంతనాలు జరిపారు. కేవలం పంజాబ్‌ కాంగ్రెస్‌లో నెలకొన్న సంక్షోభంపైనే చర్చించినట్లు తొలుత అనుకున్నప్పటికీ.. అంతకుమించి వీరిమధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు కిశోర్‌ను పార్టీలోకి తీసుకునే అంశంపై రాహుల్‌ గాంధీ కూడా పార్టీ పెద్దలతో చర్చించినట్లు సమాచారం. 

పలు పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన పీకే.. బెంగాల్‌ ఎన్నికల ఫలితాల అనంతరం ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో రాజకీయాల్లో తాను ఇప్పటికే విఫలమయ్యాయనన్న కిశోర్‌.. భవిష్యత్తు ప్రణాళిక ఏమిటో మాత్రం చెప్పలేదు. కొన్నేళ్ల క్రితం పీకే.. జేడీయూ పార్టీలో చేరారు. అయితే ఆ పార్టీతో భేదాభిప్రాయాలు రావడంతో పార్టీ నుంచి వైదొలిగారు. 

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని