UP Polls: 3 పర్యాయాలుగా.. ఎమ్మెల్యే కాని వ్యక్తులే అక్కడ ముఖ్యమంత్రి!

అయోధ్య, మథుర, గోరఖ్‌పుర్‌లలో ఏ స్థానం నుంచి పోటీ చేస్తారు..?అని మీడియా ప్రతినిధులు అడిగి ప్రశ్నకు.. ఎక్కడ నుంచైనా పోటీకి సిద్ధంగానే ఉన్నానని యోగీ ఆదిత్యనాథ్‌ చెప్పడం ఆసక్తిగా మారింది.

Published : 03 Jan 2022 01:22 IST

ఈసారి పోటీ చేసేందుకు సిద్ధమన్న ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం యోగీ

లఖ్‌నవూ: దేశంలో అత్యధిక జనాభా కలిగిన ఉత్తర్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న వేళ అక్కడి రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తాను సిద్ధమేనంటూ ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ పేర్కొన్నారు. పార్టీ అధిష్ఠానం నిర్ణయం ప్రకారం ఏ నియోజకవర్గం నుండైనా బరిలో దిగేందుకు రెడీగా ఉన్నానని స్పష్టం చేశారు. గతంలో తాను ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ నేరవేర్చానని.. తన పదవీకాలంపై ఎటువంటి అసంతృప్తి లేదని వెల్లడించారు. అయితే, దాదాపు గత మూడు పర్యాయాలుగా ఎమ్మెల్యే కాని వ్యక్తి అక్కడ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అయోధ్య, మథుర, గోరఖ్‌పుర్‌లలో ఏ స్థానం నుంచి పోటీ చేస్తారు..?అని మీడియా ప్రతినిధులు అడిగి ప్రశ్నకు.. ఎక్కడ నుంచైనా పోటీకి సిద్ధంగానే ఉన్నానని యోగీ ఆదిత్యనాథ్‌ చెప్పడం ఆసక్తిగా మారింది.

గత మూడు పర్యాయాలుగా యూపీ సీఎంగా బాధ్యతలు చేపడుతోన్న వ్యక్తులు అక్కడి శాసనమండలి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీఎస్‌పీ చీఫ్‌ మాయావతి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌తోపాటు ప్రస్తుత ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ కూడా మండలి సభ్యులుగానే ఎన్నికయ్యారు. 2003లో మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్‌ యాదవ్‌ పోటీ చేసిన తర్వాత.. సీఎం బాధ్యతలు చేపట్టిన ముగ్గురూ మండలి నుంచే ప్రాతినిధ్యం వహించడం గమనార్హం. అయితే, యోగికి ప్రత్యర్థిగా ఉన్న ఎస్‌పీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌.. వచ్చే ఎన్నికల్లోనూ తాను పోటీ చేసే అవకాశం లేదనే సంకేతాలిచ్చారు. దీనిపై పార్టీ ఓ నిర్ణయం తీసుకుంటుందని మరోసారి పేర్కొన్నారు. ఇదే సమయంలో ఆదిత్యనాథ్‌ మాత్రం ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించడం అక్కడ రాజకీయాల్లో మరింత వేడిని పెంచుతోంది.

ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్కడి విపక్షాలు ఇస్తోన్న హామీలపై సీఎం ఆదిత్యనాథ్‌ మండిపడ్డారు. ముఖ్యంగా అధికారంలోకి వస్తే గృహ వినియోగదారులకు 300 యూనిట్ల కరెంటు ఉచితంగా అందజేస్తామని అఖిలేశ్‌ యాదవ్‌ చెప్పడంపై విమర్శలు గుప్పించారు. 2017కు ముందు రాష్ట్రంలో కేవలం ఐదు జిల్లాల్లోనే కరెంటు ఉండేదనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని దుయ్యబట్టారు. అధికారంలోకి వస్తే మహిళలకు స్కూటీలు ఇస్తామని కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇవ్వడంపై స్పందించిన ఆయన.. అధికారంలో ఉన్న పంజాబ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో ఎన్ని స్కూటీలు ఇచ్చారని ప్రశ్నించారు. రాష్ట్రంలో పశువుల అక్రమ రవాణాను సమర్థంగా అడ్డుకున్నామన్న యోగి.. దాదాపు 7లక్షలకుపైగా పశువులను ప్రభుత్వ గోశాలలకు తరలించామని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని