Rakesh Tikait: భాజపా ఓటమి.. రైతు ఉద్యమ విజయమే!

రెండు రాష్ట్రాల్లో భాజపా పరాజయం కావడం రైతు ఉద్యమ విజయమేనని భారతీయ కిసాన్‌ యూనియన్‌ (BKU) నేత రాకేశ్‌ టికాయిత్‌ పేర్కొన్నారు.

Published : 04 Nov 2021 01:37 IST

రైతు సంఘం నేత రాకేశ్‌ టికాయిత్‌

దిల్లీ: హిమాచల్‌ ప్రదేశ్‌, హరియాణా రాష్ట్రాల్లో తాజాగా జరిగిన ఉపఎన్నికల్లో భాజపాకు ప్రతికూల ఫలితాలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఈ రెండు రాష్ట్రాల్లో భాజపా పరాజయం కావడం రైతు ఉద్యమ విజయమేనని భారతీయ కిసాన్‌ యూనియన్‌ (BKU) నేత రాకేశ్‌ టికాయిత్‌ పేర్కొన్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తోన్న హరియాణాలో భాజపా ఓటమి చెందడంపై  రైతు నేత ఈ విధంగా స్పందించారు.

హిమాచల్‌ ప్రదేశ్‌లో, హరియాణాలో జరిగిన ఉప ఎన్నికల్లో భాజపా ఓటమిపాలయ్యింది. తీవ్ర అసంతృప్తితో ఉన్న ప్రజలు వారిని ఓడించారు. భాజపా ఓటమి.. మా ఉద్యమ విజయం’ అని భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేశ్‌ టికాయిత్‌ పేర్కొన్నారు. రైతు ఉద్యమానికి మద్దతిస్తున్న ఇండియన్‌ నేషనల్‌ లోక్‌దళ్‌ నేత అభయ్‌ సింగ్‌ చౌటాలా విజయంతో ఇది మరోసారి స్పష్టమైందన్నారు. రైతుల సమస్యలను పట్టించుకోకుంటే భాజపాకు ఓటమి తప్పదన్న ఆయన.. వారి వాగ్దానాలకు, చేస్తున్న పనులకు పొంతన లేదని దుయ్యబట్టారు. ‘దేశ ప్రజలను అణచివేయాలని కోరుకుంటున్న కొందరు నాయకులు బలమైన వ్యూహాలు రచిస్తున్నారు. దేశాన్ని అమ్మేయాలని చూస్తున్నారు. రోజురోజుకు అన్ని వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతుండటంతో ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతోంది (ద్రవ్యోల్బణం పెరుగుతోంది). వారి పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు’ అంటూ రాకేశ్‌ టికాయిత్‌ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

ఇదిలాఉంటే, హిమాచల్‌లో మూడు స్థానాల్లోనూ కాంగ్రెస్‌ విజయం సాధించగా.. హరియాణాలో పోలింగ్‌ జరిగిన ఒక స్థానంలో ఐఎన్‌ఎల్‌డీ గెలిచింది. దీంతో భాజపాకు షాక్‌ తగిలినట్లయ్యింది. హిమాచల్‌ ముఖ్యమంత్రి జైరాం ఠాకుర్‌ సొంత జిల్లాలోని లోక్‌సభ స్థానాన్ని, మరో మూడు అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్‌ గెలుచుకోవడం దీనికి కారణం. అఆ రాష్ట్రంలో వచ్చే ఏడాది చివర్లో శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ తరుణంలో తాజా ఉప ఎన్నికల ఫలితాలు భాజపాకు ఇబ్బందికరమేనని రాజకీయ విశ్లేషకుల విశ్లేషణ.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని