Revanth Reddy: కేటీఆర్‌.. పక్కదారి పట్టించొద్దు: రేవంత్‌రెడ్డి

ఆదర్శ, పారదర్శక తెలంగాణ కోసం యువతలో విశ్వాసం కల్పించేందుకే మంత్రి కేటీఆర్‌, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి వైట్‌ ఛాలెంజ్‌ విసిరినట్లు

Updated : 12 Oct 2022 15:35 IST

హైదరాబాద్‌: ఆదర్శ, పారదర్శక తెలంగాణ కోసం యువతలో విశ్వాసం కల్పించేందుకే మంత్రి కేటీఆర్‌, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి వైట్‌ ఛాలెంజ్‌ విసిరినట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని గన్‌ పార్కు అమరవీరుల స్తూపం వద్ద నిర్వహించిన కాంగ్రెస్‌ చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. డ్రగ్స్‌ వ్యవహారంలో లోతుగా విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై లేదా?అని ప్రశ్నించారు. డ్రగ్స్‌ అమ్మకాలకు పబ్‌లు కేంద్రాలుగా మారాయని ఆరోపించారు. ఎక్సైజ్‌ శాఖ విచారణ మధ్యలో అకున్‌ సబర్వాల్‌ను బదిలీ చేశారని రేవంత్‌ ఆక్షేపించారు. ఎంపీగా ప్రజలు తనకు ఇచ్చిన బాధ్యతను గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నానని చెప్పారు. ఈ విషయంలో బాధ్యతాయుతమైన మంత్రిగా కర్తవ్యాన్ని నిర్వర్తించాలని కేటీఆర్‌కు హితవు పలికారు. 

‘‘కొన్ని పాఠశాలల్లో డ్రగ్స్‌ మహమ్మారి విస్తరిస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. వైట్‌ ఛాలెంజ్‌ విసిరితే ఎందుకు ఉలిక్కిపడుతున్నారు? ప్రస్తుత అంశాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేయొద్దు. ఎవరు నేరగాళ్లు.. ఎవరి చరిత్రేంటో చర్చ చేపడితే డ్రగ్స్‌ అంశం పక్కదారి పడుతుంది. కావాలంటే ఆ అంశంపై గన్‌పార్కు అమరవీరుల స్తూపం వద్దే ఓ రోజు చర్చ పెట్టుకుందాం’’ అని కేటీఆర్‌ను ఉద్దేశించి రేవంత్‌ అన్నారు. 

బండి సంజయ్‌, ప్రవీణ్‌కుమార్‌కు విశ్వేశ్వర్‌రెడ్డి ‘వైట్‌ ఛాలెంజ్‌’

కేటీఆర్‌ కూడా వైట్‌ ఛాలెంజ్‌ను స్వీకరించి గన్‌పార్కు వద్దకు వచ్చి ఉంటే బాగుండేదని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. గన్‌ పార్కు వద్ద ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల తప్పనిసరిగా డ్రగ్‌ టెస్ట్‌ చేయించుకునేలా చూడాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, బీఎస్పీ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌పై వైట్‌ ఛాలెంజ్‌ విసిరినట్లు విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని