Huzurabad By Election: దేశంలోనే ఖరీదైన ఎన్నికగా మార్చారు: రేవంత్‌రెడ్డి

హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో అధికార తెరాస అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి...

Updated : 24 Sep 2022 17:11 IST

హైదరాబాద్‌: హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో అధికార తెరాస అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్‌ గోయల్‌ను కలిసిన రేవంత్.. తెరాస నేతలు, పోలీసులపై ఫిర్యాదు చేశారు. నిరోష అనే యువతితో కలిసి ఫిర్యాదు చేసిన రేవంత్.. తెరాస నేతలు, పోలీసులు నిరోషపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉద్యోగాల గురించి సభలో అడిగినందుకు దూషించి దాడి చేశారని మండిపడ్డారు.

ఫిర్యాదు చేసిన అనంతరం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌ అన్ని రకాల నిబంధనలను తుంగలో తొక్కారు. హుజూరాబాద్ ఉప ఎన్నికను దేశంలోనే ఖరీదైన ఎన్నికగా మార్చారు. పంపకాల్లో వచ్చిన తేడాల వల్లే హరీశ్‌రావు, ఈటల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నిరోషా అనే యువతి నిరుద్యోగ భృతిపై మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తే.. ఆమెపై తెరాస నేతలు దాడి చేశారు. తర్వాత పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్ళిన పోలీసులు అక్కడ కూడా నిరోషను దూషించారు. నిరుద్యోగ యువతపై తెరాస నేతలు దాడులకు పాల్పడుతున్నారు. హుజూరాబాద్‌లో తెరాస, భాజపాలు వందల కోట్ల రూపాయలు వెదజల్లుతున్నారు. ప్రశ్నించే వారిపై జరిగే దాడులను కాంగ్రెస్‌ తీవ్రంగా ఖండిస్తోంది. ప్రభుత్వ తప్పిదాలను వెలికితీసిన బల్మూరి వెంకట్‌పై దాడి చేశారు. అందుకే వెంకట్‌ను హుజూరాబాద్ బరిలో నిలబెట్టాం.

వ్యూహంలో భాగంగానే తెరాస, భాజపాలు కలిసి దళితబంధును ఆపేలా చేశాయి. ఎన్నికల సమయంలో రైతుబంధు పడగా లేని ఇబ్బంది దళితబంధు అమలు విషయంలో ఎందుకు వచ్చింది?దళితుల ఏ, బీ, సీ, డీ వర్గీకరణ కోసం శాసనసభలో ప్రశ్నిస్తే.. సభ నుంచి మమ్మల్ని బయటకు పంపించిన చరిత్ర కేసీఆర్‌ది. దళితులకు మూడు ఎకరాల భూమి, దళితబంధు ఇస్తానని కేసీఆర్ మోసం చేస్తున్నారు. తెరాస పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ తరుఫున నామినేషన్ వేసిన వాళ్ళలో ఒక్క దళిత బిడ్డ కూడా లేరు. దుబ్బాక, హుజూర్‌నగర్, నాగార్జున సాగర్‌లో తెరాస, భాజపాలకు అవకాశం ఇచ్చారు. అయినా అక్కడి పరిస్థితులు ఏమాత్రం మారలేదు. అందుకే హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌కు అవకాశం ఇవ్వండి’’ అని అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని