Revanth Reddy: తెలంగాణ ఓ ల్యాండ్‌మైన్‌లాంటిది: రేవంత్‌

తెలంగాణలో విద్యార్థులు, నిరుద్యోగులపై ఆంక్షలు, నిర్బంధాలు ఇంకెన్నాళ్లని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు.

Updated : 02 Oct 2021 20:33 IST

హైదరాబాద్‌: తెలంగాణలో విద్యార్థులు, నిరుద్యోగులపై ఆంక్షలు, నిర్బంధాలు ఇంకెన్నాళ్లని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్‌ చేపట్టిన విద్యార్థి, నిరుద్యోగ జంగ్‌ సైరన్‌ ర్యాలీకి తనను వెళ్లనీయకుండా ఇంటి వద్దే పోలీసులు అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. నియంతలను తరిమికొట్టిన గడ్డ తెలంగాణ అని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజానీకం ఇంకెంతో కాలం కేసీఆర్‌ చేతిలో బందీగా ఉండదన్నారు. తెలంగాణ అమరవీరుల రుణం ఎప్పటికీ తీరనిదన్నారు. 

‘‘అధికారం ఉందికదా అని చేతిలో ఉన్న బలగాలను, కొద్దిమంది అధికారులను అడ్డం పెట్టుకొని మమ్మల్ని నిర్బంధించొచ్చు. నిజాంల పైజామ్‌లు ఊడగొట్టిన చరిత్ర ఈ గడ్డకు ఉంది. ఎంతోమందికి పాఠాలు, గుణపాఠాలు నేర్పిన చరిత్ర  ఉంది. తెలంగాణ అనేది ఒక ల్యాండ్‌మైన్‌. అణు విస్ఫో టనం చెందేముందు నివురుగప్పిన నిప్పులా ఉన్న సమాజం ఇది. చైతన్యం, స్ఫూర్తి, పోరాట పటిమతో కూడుకున్నది. త్యాగాల పునాదులపై ఏర్పడిన ఈ రాష్ట్రం కేసీఆర్‌ చేతిలో బందీగా ఉండదు. ఈ బంధనాలు తెంచుకుంటాం.. ప్రగతిభవన్‌లో బందీ అయిన తెలంగాణ తల్లికి రాష్ట్ర విద్యార్థులు, నిరుద్యోగ యువత బంధ విముక్తి కలిగిస్తుంది. అందుకు కాంగ్రెస్‌ నాయకత్వం వహిస్తుంది’’ అని రేవంత్‌ అన్నారు. నిరుద్యోగ యువతపై పోలీసుల దాడికి నిరసనగా ఆదివారం తెలంగాణ వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసనలు చేపట్టాలని కాంగ్రెస్‌ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎన్ని నిర్బంధాలకు పాల్పడ్డా.. ఎన్ని లాఠీలు ప్రయోగించినా శ్రీకాంతాచారికి నివాళులర్పించిన అందరికీ అభినందనలు తెలుపుతున్నట్టు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని