Revanth reddy: కేసీఆర్‌ దత్తత గ్రామంలో అభివృద్ధిపై చర్చకు సిద్ధం: రేవంత్‌రెడ్డి

మేడ్చల్‌ జిల్లా మూడుచింతలపల్లిలో తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్ష కొనసాగుతోంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు పలువురు

Updated : 12 Oct 2022 15:43 IST

మేడ్చల్‌: మేడ్చల్‌ జిల్లా మూడుచింతలపల్లిలో తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్ష కొనసాగుతోంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్‌ నేతలు దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ... కేసీఆర్‌ దత్తత గ్రామంలో అభివృద్ధిపై చర్చకు సిద్ధమని సవాల్‌ విసిరారు. మూడుచింతలపల్లిలో ఎన్ని డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు నిర్మించారో ఇంటింటికీ తిరుగుదాం వస్తారా అంటూ తెరాస నేతలను నిలదీశారు. గ్రామంలో 57 ఏళ్లు నిండిన వారిలో ఎంతమందికి పింఛను ఇచ్చారని ప్రశ్నించారు. ‘‘చిన్న ముల్కనూరు గ్రామాన్ని 2015 ఆగస్టు 8న దత్తత తీసుకుంటున్నాని సీఎం కేసీఆర్‌ ఆర్భాటంగా ప్రకటించారు. కొత్త ఇళ్లు కట్టిస్తామని చెప్పి గ్రామంలోని 247 ఇళ్లను పది రోజుల్లో నేలమట్టం చేశారు. కానీ, మూడేళ్లయిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు కట్టించలేదు. వాళ్లంతా తీవ్ర ఇబ్బందులు పడుతూ గుడిసెలు వేసుకుని ఉంటున్నారు’’ అని రేవంత్‌ ఆరోపించారు.

కేసీఆర్‌ దత్తత తీసుకున్న తర్వాతే కాంగ్రెస్‌ జెండా ఎగిరింది
‘‘మూడుచింతలపల్లిని దత్తత తీసుకొని రూ.28 కోట్లతో అభివృద్ధి చేస్తామన్నారు. సీఎం కేసీఆర్‌ దత్తత తీసుకున్న తర్వాతనే గ్రామంలో కాంగ్రెస్‌ జెండా ఎగిరింది. దత్తత ముసుగులో ఈ ప్రాంతాన్ని వంచిస్తున్నారు. లక్ష్మాపూర్‌కు తెలంగాణ ముఖచిత్రంలో గుర్తింపులేదు. ధరణిలో భూముల వివరాలు చేర్చలేదు. పింఛన్లు, షాదీముబారక్‌, కల్యాణలక్ష్మి ఇచ్చామని ఫ్లెక్సీలు పెట్టారు.. ఊరిలోకి వెళ్లి అడగండి 57ఏళ్లు దాటిన ఎంతమందికి పింఛన్లు వచ్చాయో. దత్తత తీసుకున్న గ్రామాల్లో 57 ఏళ్లకే పింఛన్లు, మూడెకరాల భూమి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం అమలు చేసినట్టు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అంటున్న కేసీఆర్‌.. మేడ్చల్‌ జిల్లాలో ఒక్క డిగ్రీ కాలేజీ పెట్టలేదు. గోరటి వెంకన్న రాసిన పల్లె కన్నీరు పాట .. ఈరోజు నిజమవుతోంది. ధనిక రాష్ట్రమని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది’’ అని రేవంత్‌రెడ్డి విమర్శించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని