TS News: కేసీఆర్‌, మంత్రులు దిల్లీలో విందు చేసుకొని వచ్చారు: రేవంత్‌రెడ్డి

తెలంగాణలో రైతులు పండించిన మొత్తం ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఇందిరాపార్క్‌ వద్ద కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో చేపట్టిన వరి దీక్ష..

Updated : 28 Nov 2021 20:21 IST

హైదరాబాద్‌: తెలంగాణలో రైతులు పండించిన మొత్తం ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఇందిరాపార్క్‌ వద్ద కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో చేపట్టిన వరి దీక్ష ముగిసింది. మాజీ మంత్రి జానారెడ్డి... పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ... ధాన్యం కొనుగోలుపై కేంద్రంతో చర్చలు జరిపేందుకు అవగాహన లేని మంత్రులను దిల్లీకి పంపారని విమర్శించారు. వరి పంట గురించి మంత్రులు కేటీఆర్‌, మహమూద్‌ అలీకి ఏం తెలుసని ప్రశ్నించారు. ధాన్యం సేకరణపై కేంద్రానికి, రాష్ట్రానికి చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. ధాన్యం దిగుబడి వచ్చి 45 రోజులు గడిచినా సేకరణ ఏర్పాట్లు  చేయలేదని మండిపడ్డారు. కేసీఆర్‌ నిర్లక్ష్యం వల్లే వేల టన్నుల ధాన్యం నీటిపాలు అయిందన్నారు. వద్దంటే వరి వేశారనే కక్షతోనే కేసీఆర్‌ ధాన్యం కొనుగోలు చేయటం లేదన్నారు. సీఎం మూర్ఖత్వం వల్లే ధాన్యం మొలకలు వచ్చి నిరుపయోగంగా మారిందన్నారు. తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే కేసీఆర్‌ ధర్నాలు చేశారని పేర్కొన్నారు. దిల్లీ వెళ్లిన కేసీఆర్‌.. ప్రధాని అపాయింట్‌మెంట్ కూడా కోరలేదన్నారు. కేసీఆర్‌, మంత్రులు రెండ్రోజులు దిల్లీలో విందు చేసుకుని వచ్చారని రేవంత్‌ ఆరోపించారు. 

మోదీ, కేసీఆర్‌ విఫలం: జానారెడ్డి
రైతు సమస్యల పరిష్కారంలో ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ విఫలమయ్యారని మాజీ మంత్రి జానారెడ్డి  విమర్శించారు. మోదీ, కేసీఆర్‌ కలిసి ధాన్యం సమస్యను పక్కదారి పట్టిస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ నేతలంతా ఐకమత్యంతో ముదుకు సాగాలని పిలుపునిచ్చారు. వరి దీక్షతో ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని అన్నారు. వరి దీక్షకు సంఘీభావం తెలిపిన పార్టీలు, ప్రజా సంఘాలకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్‌పార్టీ అనేక సమస్యలను పరిష్కరించి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిందన్నారు. ఆహార భద్రత చట్టం, అటవీ హక్కుల చట్టం తెచ్చింది కాంగ్రస్‌ పార్టీనే అని గుర్తు చేశారు. 

కలహాలు మాని కలిసి పనిచేస్తాం: కోమటిరెడ్డి వెంకటరెడ్డి
కాంగ్రెస్‌లో అందరం పీసీసీ అధ్యక్షులమే... చిన్న చిన్న మనస్పర్థలు వచ్చినా అందరం కలిసి పనిచేస్తామని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తమకు పదవులు ముఖ్యం కాదని పేర్కొన్నారు. గతంలో టికెట్ల విషయంలో కొన్ని పొరపాట్లు జరిగాయని, వచ్చే ఎన్నికల్లో పొరపాట్లు జరగవని చెప్పారు. ‘‘వరి వేస్తే ఉరే అన్న ఈ ప్రభుత్వానికి ఉరి వేయాలి. కేసీఆర్ సంపాదన నిజాం కంటే ఎక్కువైంది. దోపిడీ దారును ఎక్కువకాలం భరించొద్దు. వెయ్యిమందితో దిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద దీక్ష చేస్తాం. రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీని దీక్షకు ఆహ్వానిస్తాం’’ కోమటిరెడ్డి తెలిపారు.

వరి దీక్షలో కాంగ్రస్‌ తీర్మానాలు..

ఇందిరా పార్కు వద్ద నిర్వహించిన వరి దీక్షలో 9 తీర్మానాలను కాంగ్రెస్‌ నేతలు ఏకగ్రీవంగా ఆమోదించారు.

1. ప్రస్తుత ఖరీఫ్ వరి ధాన్యాన్ని తక్షణమే కొనుగొలు చేయాలి. కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి.

2. తడిసిన ధాన్యాన్ని ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయాలి.

3. ధాన్యం  కొనుగోలు వ్యవస్థలో రైస్ మిల్లర్ల ప్రమేయం ఉండకూడదు.

4. గత రబీలో ధాన్యం సేకరణలో జరిగిన అవకతవకల వల్ల రైతుకు భారీగా జరిగిన ఆర్థిక నష్టాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి.

5. యాసంగి పంటల సాగు విషయంలో ఎలాంటి ఆంక్షలు పెట్టకూడదు. భూమి స్వభావం, వనరుల అనుకూలతను బట్టి రైతుకు సాగుపై స్వేచ్ఛ ఉండాలి.

6. మద్దతు ధరల పరిధిలో ఉన్న ప్రధానమైన పంటలను మద్దతు ధరకు తక్కువ కాకుండా కొనుగోలు చేయాలి.

7. వ్యవసాయ పంటలకు సమగ్ర మద్దతు ధర, కొనుగోలు విషయంలో చట్టబద్ధత కల్పించాలి.

8. సమగ్రమైన విత్తన చట్టాన్ని తీసుకొచ్చి కల్తీ విత్తనాల బారిన పడకుండా రైతులను కాపాడాలి.

9. ఏక కాలంలో లక్ష రూపాయల రైతు రుణమాఫీ అమలు చేయాలి. ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన పంట నష్టం 2020-21 సంవత్సరానికి కోర్టు ఆదేశాల ప్రకారం పరిహారం వెంటనే రైతులకు చెల్లించాలి. అని తీర్మానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని