YSRCP: కేంద్రం అప్పులతో పోలిస్తే రాష్ట్రం అప్పు తక్కువే: సజ్జల

భారతీయ జనతాపార్టీ పాలనలో కేంద్ర ప్రభుత్వం రూ. కోటి 16 లక్షల కోట్లు అప్పు చేసిందని, కొవిడ్‌ సమయంలోనే రూ.20లక్షల కోట్లు అదనంగా అప్పు చేసిందని ..

Published : 09 Aug 2021 01:13 IST

అమరావతి: భారతీయ జనతాపార్టీ పాలనలో కేంద్ర ప్రభుత్వం రూ.కోటి 16లక్షల కోట్లు అప్పు చేసిందని, కొవిడ్‌ సమయంలోనే రూ.20లక్షల కోట్లు అదనంగా అప్పు చేసిందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కేంద్రం చేసిన అప్పుతో పోలిస్తే రాష్ట్రం చేసిన అప్పు చాలా తక్కువన్నారు.  ఇతర రాష్ట్రాల్లోనూ ఇంతకు మించి అప్పులు చేశారన్నారు. సీఎం జగన్‌ పాలనలో రాష్ట్ర అప్పులపాలైందని భాజపా చేస్తోన్న దుష్ప్రచారాన్ని వైకాపా నేతలు తిప్పికొట్టాలన్నారు. 

వైకాపా కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర స్థాయి ఆర్యవైశ్య నేతల సమావేశంలో సజ్జల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...జనాల జేబుల్లో డబ్బు ఉంటేనే  కొనుగోళ్లు పెరిగి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందనే ఉద్దేశంతో సీఎం జగన్‌ నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో రూ.లక్ష కోట్లకు పైగా జమ చేస్తున్నట్టు తెలిపారు. తెచ్చే ప్రతి పైసా అప్పునూ సద్వినియోగం చేస్తున్నామన్నారు. జగన్‌ అనుసరించే మత విశ్వాసాన్ని  ఆధారంగా చేసుకుని దుష్ప్రచారం చేసేందుకు భాజపా యత్నిస్తోందని, దీన్ని అందరూ సమర్ధంగా తిప్పికొట్టాలన్నారు. భాజపా నేతలకు ప్రజల సమస్యలపై పోరాటం, సమస్యల పరిష్కారం అనే అజెండాతో సంబంధం లేదని, మతం ప్రాతిపదికగా దుష్ప్రచారం చేయడమే వారి అజెండా అన్నారు. రాబోయే రోజుల్లో మత విశ్వాసాలు, ఆర్థికపరమైన అంశాలే అజెండాగా దాడి జరగబోతోందని, దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు నేతలు సిద్ధంగా ఉండాలన్నారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, పలువురు వైకాపా నేతలు సమావేశంలో పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని