Ap News: ఏపీకి ఇప్పుడు మంచి ప్రతిపక్షాల అవసరముంది: సజ్జల

కొత్త ఏడాదిలో రాష్ట్ర ప్రజలకు మరింత దగ్గరయ్యేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. రాష్ట్ర విభజన కష్టాలు ఇప్పటికీ

Published : 02 Jan 2022 01:19 IST

అమరావతి‌: కొత్త ఏడాదిలో రాష్ట్ర ప్రజలకు మరింత దగ్గరయ్యేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. రాష్ట్ర విభజన కష్టాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయన్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలలకే కరోనా కష్టాలు వచ్చాయని.. అనేక ఇబ్బందులు ఎదురైనా సంక్షేమ పథకాలు అమలు చేశామని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లోగా రాష్ట్రంలో 80 లక్షల కుటుంబాలు సొంతింట్లో ఉండటమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. అన్ని అడ్డంకులను ఎదుర్కొని ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో చేస్తుంటే విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని.. కొన్ని పార్టీలు రాజకీయంగా దిగజారిపోయి వ్యవహరిస్తున్నాయని సజ్జల మండిపడ్డారు.

‘‘అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామంటే వామపక్షాలు కూడా ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. భాజపా నేతలకు ప్రజలకు సంబంధించిన అంశాలు కావాలా లేక మతపరమైన అంశాలు కావాలో ఆలోచించుకోవాలి. ముఖ్యమంత్రి జగన్.. విలువైన మానవ వనరులను సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఏది కూడా వృథాగా పోవడం లేదు.  వచ్చే 10-15 ఏళ్ళలో మంచి విద్యావంతులైన యువత ఇక్కడ సంపద సృష్టిస్తారు. ఇదే వైకాపా ప్రభుత్వ దీర్ఘకాలిక వ్యూహం. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల ఫలితమే స్థానిక సంస్థల్లో విజయం. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో ఏపీ విప్లవం సృష్టిస్తోంది. రాజకీయ పార్టీలకు ఒక విధానం ఉండాలి. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ విధానాలే ఇకపై ఏపీ రాజకీయాల్లో శాశ్వతంగా ఉంటాయి. తెదేపా అధినేత చంద్రబాబు పాత రాజకీయాలు చేస్తే కనుమరుగవుతారు. ఏపీకి ఇప్పుడు మంచి ప్రతిపక్ష పార్టీల అవసరం ఉంది. రాజకీయ దురుద్దేశాలతో కాకుండా ప్రజా సంక్షేమాన్ని కోరుకుంటూ విమర్శలు చేస్తే మార్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని