అలా ఉండకపోతేశశిథరూర్‌ను పార్టీ నుంచి తొలగిస్తాం: కేపీసీసీ

పార్టీ ఆదేశాలను వ్యతిరేకించే అధికారం కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌తో సహా పార్టీలో ఎవ్వరికీ లేదని కేరళ పీసీసీ అధ్యక్షుడు కే సుధాకరన్‌ పేర్కొన్నారు.

Published : 27 Dec 2021 01:13 IST

కన్నూర్‌: కేరళ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఇద్దరు ఎంపీల మధ్య అగాధం పెరుగుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ ఆదేశాలను వ్యతిరేకించే అధికారం కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌తో సహా పార్టీలో ఎవ్వరికీ లేదని కేరళ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ కె.సుధాకరన్‌ పేర్కొన్నారు. అంతేకాకుండా అలా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండకపోతే ఎవర్నైనా పార్టీ నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. ‘పార్టీలో శశిథరూర్‌ ఓ వ్యక్తి మాత్రమే. శశిథరూర్‌ ఒక్కడే కాంగ్రెస్‌ పార్టీ మొత్తం కాదు. ఒకవేళ పార్టీ నిర్ణయానికి ఆయన కట్టుబడి ఉంటే పార్టీలో కొనసాగుతారు. లేదంటే పార్టీ నుంచి వెళ్లిపోవాల్సి వస్తుంది’ అని సుధాకరన్‌ స్పష్టం చేశారు.

కేరళ ప్రభుత్వం ప్రతిపాదించిన సెమీ హైస్పీడ్‌ రైలు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎస్‌ సభ్యులు ఓ లేఖను రూపొందించారు. దీనిపై సంతకం చేయడంపై శశిథరూర్‌ తాత్సారం వహిస్తున్నారు. దీనికితోడు పెట్టుబడుల అనుకూల సీఎం అని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను శశిథరూర్‌ ప్రశంసించడం కాంగ్రెస్‌ పార్టీకి మింగుడు పడడం లేదు. ఇలా పలు అంశాల్లో పార్టీకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న శశిథరూర్‌పై కాంగ్రెస్‌ రాష్ట్రశాఖ ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది.

పార్టీ అధ్యక్షుడు చేసిన ప్రకటనపై శశిథరూర్‌ స్పందించారు. కొన్ని విషయాల్లో రాజకీయ విభేదాలను పక్కన పెట్టాల్సిన అవసరం ఉందని ట్విటర్‌లో పేర్కొన్నారు. ఇక రైలు ప్రాజెక్టు అంశాన్ని అధ్యయనం చేసిన తర్వాతే తన అభిప్రాయాన్ని వెల్లడిస్తానని స్పష్టం చేశారు. ఇందుకు కేపీసీసీ అధ్యక్షుడు స్పందిస్తూ.. ప్రతిఒక్కరికీ సొంత అభిప్రాయాలు ఉండవచ్చన్నారు. అయినప్పటికీ శశిథరూర్‌ లేదా సుధాకరన్‌.. ఎవ్వరికైనా పార్టీ ఆదేశాలను వ్యతిరేకించే అధికారం లేదన్నారు. అలాంటి అధికారం పార్టీ ఎవ్వరికీ ఇవ్వలేదన్న ఆయన.. ఎంపీలకూ వర్తిస్తుందని చెప్పారు. దీనిపై వివరణ ఇవ్వాలని శశిథరూర్‌ను ఇప్పటికే కోరామని.. అది అందిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని పీసీసీ చీఫ్‌ స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని