AP News:బెయిల్‌పై ఉన్న నేతలు త్వరలోనే జైలుకు: ప్రకాశ్‌ జావడేకర్‌

ఏపీని అభివృద్ధికి దూరం చేశారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. విజయవాడలో ఏర్పాటు చేసిన ప్రజాగ్రహ సభలో సోము వీర్రాజు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం

Updated : 28 Dec 2021 20:38 IST

విజయవాడ: వైకాపా, తెదేపా, తెరాస.. మూడూ కుటుంబ పార్టీలే... ఈ 3 ప్రాంతీయ పార్టీలు అవినీతికి పాల్పడుతున్నాయని కేంద్ర మాజీ మంత్రి, భాజపా సీనియర్‌ నేత ప్రకాశ్‌ జావడేకర్‌ ఆరోపించారు. విజయవాడలో భాజపా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆగ్రహ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఏపీలో తెదేపా, వైకాపా రెండూ ప్రజలను మోసం చేశాయని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో చాలామంది నేతలు బెయిల్‌పై బయట ఉన్నారని, వారంతా త్వరలోనే జైలుకు వెళ్తారని పేర్కొన్నారు. ‘‘ఏపీలో విధ్వంసకర పాలన సాగుతోంది. మద్య నిషేధం  అని చెప్పి మద్యంపై వచ్చిన డబ్బుతోనే  పాలన సాగిస్తున్నారు. ఇచ్చిన హామీలు ఏవీ జగన్‌ నెరవేర్చలేదు. కేంద్ర పథకాలకు రాష్ట్ర స్టిక్కర్లు అంటిస్తున్నారు. ఇక్కడ కట్టించేది జగనన్న కాలనీలు కాదు.. మోదీ కాలనీలు. నా హయాంలోనే పోలవరానికి అనుమతులు వచ్చాయి. అనుమతులు ఇచ్చి ఏడేళ్లయినా పోలవరం పూర్తి చేయలేదు. అమరావతి కోసం అటవీ భూములను బదిలీ చేశాం. రాజధాని విషయంలో తెదేపా, వైకాపా ఘర్షణ పడుతున్నాయి. సభకు వస్తున్నప్పుడు దారిలో ‘పుష్ప’ సినిమా పోస్టర్‌ చూశా. ఎర్రచందనం స్మగ్లింగ్‌పై వేసిన సిట్‌ను ఏపీలో రద్దు చేశారు. ఈ రాష్ట్రానికి మేలు చేసే నాయకత్వం తప్పక అవసరం. ఏపీలో వచ్చే ఎన్నికల్లో అధికారం మాదే’’ అని ప్రకాశ్‌జావడేకర్‌ తెలిపారు.

ఏపీని అభివృద్ధికి దూరం చేశారు : సోము వీర్రాజు

తెదేపా, వైకాపా ప్రభుత్వాలు ఏపీని అభివృద్ధికి దూరం చేశారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. విజయవాడలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేంద్రం ఇచ్చిన నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని, కేంద్ర పథకాలకు వైకాపా స్టిక్కర్లు అంటిస్తున్నారని విమర్శించారు. ‘‘జగన్‌కు ఏం చూపించాలో అది చూపించే పార్టీ మాదే.  మనం ఎందుకు భయపడాలి? మనం ఎప్పుడైనా జైలుకు వెళ్లామా.. భవిష్యత్తులో వెళ్తామా? పలు చోట్ల ఆస్తులు పోగేసుకునేందుకే ఈ నేతల తాపత్రయం. రాజకీయాల్లో నిరాడంబరత్వం చూపించిన పార్టీ మాదే. ఏపీలోని అనేక హైవేలను కేంద్రం అభివృద్ధి చేస్తోంది. భాజపా అధికారంలోకి వస్తేనే ఏపీ సర్వతోముఖాభివృద్ధి సాధ్యం. రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ సభ పెట్టాం. వచ్చే ఎన్నికల్లో భాజపా అధికారంలోకి రావాలి. ప్రత్యేక హోదా ఎందుకు వద్దన్నారని  ముందు చంద్రబాబును అడగాలి. ప్రత్యేక హోదా .. నీతి ఆయోగ్‌ పరిధిలో ఉంది. రాష్ట్రంలో అన్నీ అమ్మేస్తున్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ఇప్పటికీ కాపాడుతున్న పార్టీ మాదే. స్టీల్‌ ప్లాంట్‌ నష్టం రూ.3వేల కోట్లను ఇప్పటికీ భర్తీ చేస్తున్నాం. యూనియన్ల పేరుతో పాఠశాలలను సర్వనాశనం చేసింది కమ్యూనిస్టులే. పేదపిల్లల ఆహార నిధులనూ దోచుకున్నారు. ట్రేడింగ్‌ పార్టీలకు ఏజెంట్లు కమ్యూనిస్టు పార్టీలు’’ అని సోము వీర్రాజు విమర్శించారు.

 

ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు మాట్లాడుతూ... ‘‘వైకాపా అంటే ఏమీ చేతకాని ప్రభుత్వం. రాష్ట్రంలో తెదేపాకు భవిష్యత్తు లేదు. భాజపా అంటే భవిష్యత్తులో జయించే పార్టీ.  మోదీ పట్ల ప్రజల్లో భక్తి భావం ఉంది. కేంద్రం రాష్ట్రానికి ఇస్తున్న నిధులు ఏమవుతున్నాయి? రాష్ట్రం ఎందుకు ఆర్థిక సంక్షోభంలో ఉంది. అవినీతిమయం కాని రంగం రాష్ట్రంలో ఏదీ లేదు. రాష్ట్ర ప్రజలకు భాజపాయే ప్రత్యామ్నాయం’’ అని పేర్కొన్నారు. మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు మాట్లాడుతూ...‘‘ కోటి మంది దళితులు వైకాపాకు గంపగుత్తగా ఓటు వేశారు. కానీ దళితులపై వైకాపా ప్రభుత్వం దౌర్జన్యాలకు పాల్పడుతోంది. ఎస్సీ నియోజకవర్గం తాడికొండలో అమరావతి రాజధానికి ప్రధాని శంకుస్థాపన చేశారు. దళితులు బాగుపడటం ఇష్టంలేకే వైకాపా రాజధాని మార్చడానికి నిర్ణయం తీసుకుంది’’ అని ఆరోపించారు. ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేశ్‌, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి, భాజపా నేత కన్నా లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని