Chandrababu: పోలీసులే దౌర్జన్యానికి దిగితే సామాన్యులకు దిక్కెవరు?: చంద్రబాబు

ఏపీలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రోజుకో దుర్మార్గపు వార్త వినాల్సి వస్తోందని తెదేపా అధినేత

Updated : 11 Sep 2021 13:33 IST

అమరావతి: ఏపీలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రోజుకో దుర్మార్గపు వార్త వినాల్సి వస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. జగన్‌ బంధువు తిరుపాల్‌రెడ్డి అక్బర్‌ బాషా భూమి కబ్జా చేసినట్లు తెలిసిందన్నారు. కడప జిల్లా దువ్వూరుకు చెందిన ఓ మైనార్టీ కుటుంబం తమ భూమిని వైకాపా నేతలు ఆక్రమించారని సెల్ఫీ వీడియో తీసుకొని.. ఆత్మహత్య చేసుకుంటామని ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆయన స్పందించారు.
‘‘కొంతమంది పోలీసులు విధులు పక్కనబెడుతున్నారు. సివిల్‌ పంచాయతీల్లో పోలీసులు తలదూర్చడం మామూలైంది. ఎన్‌కౌంటర్‌ చేస్తానని బాధితుడిని బెదిరించడం దారుణం. పోలీసులే దౌర్జన్యానికి దిగితే సామాన్యుడికి దిక్కెవరు?గతంలో నంద్యాలలో సలీం కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. అక్బర్‌ కుటుంబం కూడా తమకు అదే మార్గంలో దిక్కంటోంది. తెదేపా అండగా ఉంటుంది. అక్బర్‌ బాషా ధైర్యంగా ఉండండి. ప్రభుత్వం వెంటనే అక్బర్‌ బాషా కుటుంబానికి న్యాయం చేయాలి. బాధ్యులపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి’’ అని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

కబ్జాలపై పోరాడితే చిత్రహింసలు పెడుతున్నారు: లోకేశ్‌

‘‘పోలీస్‌ వ్యవస్థను జగన్‌ ఫ్యాక్షన్ సైన్యంగా మార్చుకుంటున్నారు. నంద్యాలలో అబ్దుల్‌ సలాం కుటుంబాన్ని వేధించారు. ఇప్పుడు అక్బర్‌ బాషా ఉసురు పోసుకోవద్దు. జగన్‌ బంధువులు, పార్టీ నేతలకు అధికారమే ఆయుధం, చట్టమే చుట్టం. కన్నుబడితే కబ్జా, ఆశపడితే ఆక్రమణ, ఇదేంటని నిలదీస్తే నిర్బంధం. కబ్జాలపై పోరాడితే పోలీసులు చిత్రహింసలు పెడుతున్నారు. ఎన్‌కౌంటర్‌ చేస్తామని బెదిరిస్తారా?’’ అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని