AP Politics: వైకాపా అసమర్థత వల్లే పెట్రోల్‌ సెంచరీ.. లీటర్‌కు ₹30 తగ్గించాలి: బొండా ఉమ

పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదలను నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా శ్రేణులు నిరసనలు చేపట్టారు. ఇందులో భాగంగా విజయవాడ ధర్నా చౌక్‌ వద్ద ఆ పార్టీ ఆధ్వర్యంలో ..

Updated : 28 Aug 2021 14:00 IST

అమరావతి: పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదలను నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా శ్రేణులు నిరసనలు చేపట్టాయి. ఇందులో భాగంగా విజయవాడ ధర్నా చౌక్‌ వద్ద ఆ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. తెదేపా నేతలు బొండా ఉమ, గద్దె రామ్మోహన్ ధర్నాలో పాల్గొన్నారు. వైకాపా ప్రభుత్వం అసమర్థత వల్లే పెట్రోల్‌ ధర సెంచరీ దాటిందని బొండా ఉమ విమర్శించారు. దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏపీనేనని మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వం పన్నులు, రోడ్డు సెస్సులు పెంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వైకాపా ప్రభుత్వం లీటర్‌కు రూ.30 తగ్గించాలని డిమాండ్‌ చేశారు.

మరోవైపు పెట్రోల్‌ పెంపును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టిన తెదేపా నేతలను పోలీసులు ఎక్కడికక్కడ గృహనిర్భందం చేశారు. పులివెందులలో ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి ర్యాలీకి పిలుపిచ్చిన బీటెక్‌ రవిని పోలీసులు ఇంటి వద్దే అడ్డుకున్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో తెదేపా బైక్‌ ర్యాలీని పోలీసులు నిరాకరించారు. దీంతో ఆ పార్టీ నేతలు కోటబొమ్మాళి రైతు బజార్‌ వరకు కాలి నడకన వెళ్లారు. ఈ ర్యాలీలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్‌ నాయుడు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో క్లాక్‌ టవర్‌ వద్ద ఆ పార్టీ నాయకులు ధర్నా చేశారు. నరసరావుపేటలో ఆ పార్టీ నేత చదలవాడ అరవిందబాబుతో సహా స్థానిక నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో నరసరావు పేట గ్రామీణ పీఎస్‌ ఎదుట తెదేపా నేతలు ఆందోళనకు దిగారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని