
AP News: ఆంధ్రప్రదేశ్‌ను అదానీప్రదేశ్‌గా మార్చే ఆలోచనలొద్దు: పయ్యావులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ను అదానీప్రదేశ్‌గా మార్చే ఆలోచనలు చేయొద్దని తెదేపా సీనియర్ నేత, ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ అన్నారు. కేంద్ర సౌర విద్యుత్ సంస్థ(సెకీ) అనేది నిరంతరం టెండర్లు పిలుస్తూనే ఉంటుందని ఎవరికి కావాలంటే వాళ్లు వెళ్లి టెండర్ వేసుకుంటారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిదివేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు సెకీతో ఒప్పందం కుదుర్చుకోవడం వెనుక భారీ కుంభకోణం ఉందని ఆయన ఆరోపించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పయ్యావుల మీడియాతో మాట్లాడారు.
తక్కువ ధరకు విద్యుత్ దొరుకుతున్నప్పుడు ఎక్కువ ధరెందుకు అని ప్రశ్నించారు. రూ.2 టెండర్ వదిలి రూ.2.49కి ఎలా వెళ్తారని.. యూనిట్ రూ.2.49కు కొనాలని ఎలా నిర్ణయం తీసుకున్నారని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు వెనక్కు తీసుకుంటే డిస్కంలకు చేరేసరికి యూనిట్ ధర రూ.2.49 కూడా కాదు.. రూ.3.40 నుంచి రూ.4 వరకు అవుతుందని పయ్యావుల చెప్పారు.
‘‘రాష్ట్రంలో ప్లాంట్ పెట్టకుండా ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తారా? 6వేల మెగా వాట్లను వెంటనే తీసుకోవడానికి రాష్ట్రంలో లైన్లు సిద్ధం. భూములు, లైన్లు ఉన్నప్పుడు పక్క రాష్ట్రంతో అవసరమా?ప్రజాధనం కొల్లగొట్టే హక్కు ఎవరికీ లేదు. ట్రాఅప్ ఛార్జీల పేరుతో ప్రజలపై భారం వేస్తారా?తప్పులు మీద తప్పులు చేస్తూ సమర్థించుకుంటారా?ఇప్పటికైనా ప్రజల ముందు వాస్తవాలు ఉంచాలి. సెకీ వద్ద ఉన్న రూ.2 టెండర్లు కొనుగోలు చేయవచ్చు కదా. ధర నిర్ణయం మా చేతిలో లేదు.. ఏపీఈఆర్సీదే అన్నారు. ఈఆర్సీ చేతిలో ఉన్నప్పుడు రూ.2.49 అని మీరెలా చెబుతారు. పది పైసలు తగ్గించే మార్గాలు ఉన్నప్పుడు ఎక్కువ ధర అవసరమా?’’ అని పయ్యావుల ప్రశ్నించారు.