Ap News: జోగి రమేశ్‌పై చర్యలు తీసుకోవాలి.. రాష్ట్రపతి, ప్రధానికి తెదేపా శ్రేణుల లేఖలు

తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇంటిపైకి దండయాత్రగా వచ్చి దాడికి యత్నించిన పెడన ఎమ్మెల్యే జోగి రమేశ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం

Published : 29 Sep 2021 19:30 IST

అమరావతి: తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇంటిపైకి దండయాత్రగా వచ్చి దాడికి యత్నించిన పెడన ఎమ్మెల్యే జోగి రమేశ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణులు రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్లకు లేఖల ద్వారా ఫిర్యాదు చేశారు. గ్రామ కమిటీల్లో నేతలు తీర్మానం చేసి సంతకాలు చేసిన లేఖలను పోస్టు ద్వారా పంపినట్టు పార్టీ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. వైకాపా అధికారం చేపట్టిన నాటి నుంచి ఏపీలో ఎస్సీలపై దమనకాండ, ఆదివాసీల సంపద దోపిడీ, మహిళలపై అరాచకాలు, బీసీ, మైనార్టీలపై వేధింపులు ఎక్కువయ్యాయని నేతలు ఆరోపించారు. ప్రతిపక్షాలపై తప్పుడు కేసులు పెట్టడంతో పాటు గృహ నిర్బంధాలు చేయిస్తూ భౌతిక దాడులు, మానసిక వేధింపులు, బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. సెప్టెంబరు 17న చంద్రబాబు ఇంటిపై జోగి రమేశ్‌, అతని అనుచరుల దాడితో రాక్షస, ఆటవిక పాలన పరాకాష్టకు చేరిందని ధ్వజమెత్తారు.

దాడికి ముఖ్యమంత్రి జగన్‌, డీజీపీల మద్దతు ఉందని జోగి రమేశ్‌ బహిరంగంగానే చెప్పినందున డీజీపీని రీకాల్‌ చేయాలని కోరారు. సీఎం దర్శకత్వంలోనే ఈ దాడి జరగటం ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అన్నారు. దాడిపై ఒకరోజు ముందే జోగి రమేశ్ ప్రకటించినా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకోకపోగా వత్తాసు పలికారని ఆరోపించారు. తెదేపా నేతలు ప్రజా సమస్యలపై ఎలాంటి నిరసన కార్యక్రమాలు తలపెట్టినా ముందుగానే గృహ నిర్బంధాలు, అక్రమ అరెస్టులు చేయటంతో పాటు ఎదురు కేసులు పెడుతున్నారని తప్పుబట్టారు. అధికార పార్టీ నేతల హింసాత్మక దాడులపై ముందస్తు సమాచారం ఉన్నా పోలీసులు చర్యలు తీసుకోకపోవటం వ్యవస్థకే మాయని మచ్చలాంటిదని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేత ఇంటిపై దాడి చేయటం, నేతలను బెదిరించటం వంటి హింసా రాజకీయాలకు ప్రజాస్వామ్యంలో చోటు లేదని నేతలు స్పష్టం చేశారు. దాడికి బాధ్యులైన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకొని, ప్రజాస్వామ్యాన్ని, శాంతి భద్రతలను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు