Varla ramaiah: చంద్రబాబు ఇంటి వద్ద ఘటనపై గవర్నర్‌కు తెదేపా ఫిర్యాదు

తెదేపా అధినేత చంద్రబాబు నివాసం వద్ద నిన్న జరిగిన ఘటనపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. తెదేపా నేతల బృందం ఇవాళ రాజ్‌భవన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది

Updated : 18 Sep 2021 17:22 IST

అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబు నివాసం వద్ద నిన్న జరిగిన ఘటనపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. తెదేపా నేతల బృందం ఇవాళ రాజ్‌భవన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. గవర్నర్‌ అందుబాటులో లేకపోవడంతో ఆయన కార్యదర్శికి వినతిపత్రం సమర్పించినట్టు తెదేపా నేతలు తెలిపారు.  వైకాపా నేతలు దాడికి పాల్పడుతున్న దృశ్యాల సీసీ టీవీ ఫుటేజీని కూడా వినతిపత్రంతో పాటు గవర్నర్‌ కార్యదర్శికి సమర్పించామన్నారు. తెదేపా సీనియర్‌ నేతలు వర్ల రామయ్య, అశోక్‌బాబు, బుద్దా వెంకటన్న తదితరులు రాజ్‌భవన్‌కు వెళ్లిన వారిలో ఉన్నారు. 

ఈ సందర్భంగా వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ... ‘‘డీజీపీకి వినతిపత్రం ఇచ్చినా చెత్తబుట్టలో వేస్తారు ఉపయోగం లేదు. డీజీపీ, సీఎం మధ్య ఏం ఒప్పందం ఉందో మాకు తెలియదు. జరిగిన దాడి ఘటనపై గవర్నర్‌ కార్యదర్శికి వివరించాం. వైకాపా నేతలు పోలీసులను ఎన్నో రకాలుగా తిట్టారు. గతంలో ఎందరినో దూషించినప్పుడు పోలీసు అధికారుల సంఘం ఏం చేసింది? చంద్రబాబు ఇంటికి వచ్చేందుకు జోగి రమేశ్‌కు ఏం పని?’’ అని వర్ల రామయ్య ప్రశ్నించారు. అంతకు ముందు తెదేపా కార్యాలయంలో వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ...  వైకాపా నేతలు ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే స్పందించని పోలీసు అధికారుల సంఘానికి తెలుగుదేశం నేతల ప్రశ్నలపైనే అభ్యంతరాలు ఎందుకని ప్రశ్నించారు. పోలీసుల తీరుపై బహిరంగ చర్చకు రావాలని పోలీసు అధికారుల సంఘాన్ని కోరారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని