AP News: ఓటీఎస్‌ పేరుతో రూ.5వేల కోట్ల దోపిడీకి యత్నం: తెదేపా

‘ఓటీఎస్‌ వసూళ్లు పేదలకు ఉరితాళ్లు’ అంటూ అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద తెదేపా నిరసన ప్రదర్శనలు చేపట్టింది

Updated : 27 Dec 2021 15:53 IST

అమరావతి: ‘ఓటీఎస్‌ వసూళ్లు పేదలకు ఉరితాళ్లు’ అంటూ అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద తెదేపా నిరసన ప్రదర్శనలు చేపట్టింది. ఓటీఎస్‌ పేరుతో పేదల నుంచి రూ.5వేల కోట్లు దోచుకునేందుకు అధికార పార్టీ మాస్టర్‌ ప్లాన్‌ వేసిందని తెదేపా నేతలు ఆరోపించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పేదల ఇళ్లను ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేసి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో తెదేపా కదం తొక్కింది. పెద్ద ఎత్తున తరలివచ్చిన ఆ పార్టీ శ్రేణులు ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ర్యాలీగా కలెక్టరేట్ వరకు వెళ్లి అధికారులకు వినతిపత్రం అందజేశారు. పేదలను ఓటీఎస్‌ పేరిట వేధించడం సరికాదని ఎమ్మె్ల్యే డోలా వీరాంజనేయస్వామి, పార్టీ నేత దామచర్ల జనార్థన్‌ మండిపడ్డారు.

తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఓటీఎస్‌కు వ్యతిరేకంగా తెదేపా శ్రేణులు భారీ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టాయి. ఓటీఎస్‌ రద్దు చేయాలంటూ తెదేపా నేతలు చినరాజప్ప, జ్యోతుల నెహ్రు, కొండబాబు నిరసన చేపట్టారు. నిరసన కారులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గుంటూరు మున్సిపల్‌ కార్యాలయం నుంచి కలెక్టరేట్‌ వరకు తెదేపా నేతలు ర్యాలీ చేపట్టారు. ఆ పార్టీ నేతలు ప్రత్తిపాటి, ఆలపాటి రాజా, యరపతినేని, జీవీ ఆంజనేయులు, నక్కా ఆనందబాబు కలెక్టరేట్‌ ముట్టడికి యత్నించగా పోలీసులు చెదరగొట్టారు. కడప కలెక్టరేట్‌ ముట్టడికి తెదేపా నాయకులు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కర్నూలు తెదేపా శ్రేణులు భారీగా ర్యాలీ చేపట్టారు. ఓటీఎస్‌ను రద్దు చేయాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మిగతా జిల్లాల్లోనూ తెదేపా నేతలు, శ్రేణులు ఓటీఎస్‌కు వ్యతిరేకంగా ర్యాలీలు, నిరసనలు చేపట్టారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని