
AP News: చైనా సమస్య జగన్‌కు ఎందుకు?: పయ్యావుల
విజయవాడ: ఏపీలో విద్యుత్ సంక్షోభానికి సీఎం జగనే కారణమని పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ అన్నారు. రాష్ట్రం సమస్యను ఇతర దేశాలతో పోలుస్తారా అని ప్రశ్నించారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘విద్యుత్ సంక్షోభంపై ప్రధానికి రాసిన లేఖలో చైనా, యూరప్‌తో ఏపీని పోలుస్తారా?విద్యుత్ విషయంలో పొరుగున ఉన్న తెలంగాణతో పోల్చుకోలేదు. తెలంగాణలో విద్యుత్ వ్యవస్థ మెరుగ్గా ఉంటే చైనా సమస్య జగన్‌కు ఎందుకు?విభజన నాటికి ఏపీ మిగులులో ఉంటే.. తెలంగాణ లోటులో ఉంది. విద్యుత్ విషయంలో ఇప్పుడు తెలంగాణ మెరుగ్గా ఉంది.
వర్షాకాలంలో.. రిజర్వాయర్లు నిండిన సమయంలో విద్యుత్ కోతలా?ఆర్థిక రంగాన్ని సంక్షోభంలోకి నెట్టినట్లే విద్యుత్ వ్యవస్థను కుదేలు చేశారు. సీఎంతో అసత్యాలు పలికిస్తూ అధికారులు ప్రధానికి లేఖ రాయించారు. విద్యుత్ సంస్థల దివాళాకు కారణం ప్రభుత్వ కక్ష సాధింపే. రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకానికి ప్రధానిని బాధ్యుణ్ని చేయొద్దు. ప్రధానికి లేఖ రాసి బాధ్యత నుంచి తప్పుకోవడం సరికాదు. ట్రు అప్ పేరుతో ఛార్జీల భారాన్ని ప్రజలు భరించాలా?ప్రజలపై రూ.50 వేల కోట్ల అదనపు భారం ఎందుకు మోపుతున్నారు’’ అని పయ్యావుల ప్రశ్నించారు.