
AP News: అమరావతి భూములు తాకట్టు పెట్టేందుకే కార్పొరేషన్: సోమిరెడ్డి
అమరావతి: ప్రజలను హింసిస్తే కానీ ముఖ్యమంత్రి జగన్‌కు నిద్ర పట్టడం లేదని తెదేపా సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. బ్యాంకుల నుంచి రుణం తీసుకోవడానికే రాజధాని కోసం భూములిచ్చిన రైతులను పీడిస్తున్నారని మండిపడ్డారు. రాజధాని పరిధిని కొన్ని గ్రామాలకే పరిమితం చేసేందుకు అమరావతి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కార్పొరేషన్ పేరులోనే క్యాపిటల్ సిటీ అని కొత్త కుట్రకు తెరలేపారని విమర్శించారు. మంగళగిరిలోని తెదేపా పార్టీ కార్యాలయంలో సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు.
‘‘29 గ్రామాలను ఒకే కార్పొరేషన్ పరిధిలోకి తీసుకురావాలి. రైతులకు వ్యతిరేకంగా వెళితే జగన్‌ను దేవుడు కూడా క్షమించడు. అమరావతి పరిధిలో ఎకరా రూ.7కోట్ల విలువ చెబుతున్నారు. 480 ఎకరాలు తాకట్టుకు ఇప్పటికే డీపీఆర్ సిద్ధం చేశారు. 34వేల ఎకరాల విలువ రూ.2లక్షల కోట్లకు పైబడి ఉంటుంది. రూ.2లక్షల కోట్ల అమరావతి భూములు తాకట్టు పెట్టేందుకు కార్పొరేషన్. రైతుల సమస్యలు పరిష్కరించకుండా భూముల తాకట్టుపై కన్నుపడింది. న్యాయస్థానం ఆదేశాలను ప్రభుత్వం ఎలా ఉల్లంఘిస్తోంది. కార్పొరేషన్‌ను వ్యతిరేకిస్తూ ప్రజలు తీర్మానాలు చేస్తున్నారు. ఓటు హక్కు ఉన్నవారే గ్రామసభల్లో అభిప్రాయాలు తెలపాలని చెప్పడమేంటి?పులివెందులతో ఓటు హక్కు ఉన్న జగన్ నిర్ణయాలు ఎలా తీసుకుంటారు?’’ అని సోమిరెడ్డి ప్రశ్నించారు.